డ్రోన్ల వినియోగం ద్వారా వ్యవసాయరంగంలో మౌలిక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పొగాకు బోర్డు చైర్మన్, బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాధ్ బాబు తెలిపారు.
భారత్ మహోత్సవం 2022 పేరుతో డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-కేంద్ర పౌర విమానయాన శాఖ సంయుక్తంగా ఈనెల 27, 28న ఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్వహించిన డ్రోన్ల ఎగ్జిబిషన్ లో తాను పాల్గొన్నాననీ, 75 కంపెనీలు డ్రోన్ల వినియోగం పరిజ్ఞానంపై స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.
రెండు వేల మందికి పైగా పాల్గొన్న సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. డ్రోన్ల వినియోగ నిబంధనలు సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు.
వ్యవసాయరంగంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయ భారాన్ని తగ్గించేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయనీ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లను తయారు చేయటంతో పాటు తక్షణ వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారని రఘునాధ బాబు తెలిపారు.
ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా కలుపు, పిచికారి పనులు చేపట్టగా వ్యయం 25 శాతం తగ్గిపోవటమే కాకుండా ఎంతో సమయం ఆదా అయిందని చెప్పారు. అతి త్వరలోనే ఏపీలో డ్రోన్ల వినియోగానికి శ్రీకారం చుట్టనున్నట్టు ఆయన వెల్లడించారు.

More Stories
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్