భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2021-22 ఏడాది ఇరుదేశాల మధ్య  119.42 బిలియన్ డాలర్లు విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. అంతక్రితం ఏడాది 2020-21లో ఇరుదేశాల మధ్య 80.51 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని గణాంకాలు స్పష్టం చేశాయి. 
 
దీంతో వాణిజ్యపరంగా డ్రాగన్ దేశం చైనాను అధిగమించి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. 2021-22లో అమెరికాకు భారత్ ఎగుమతుల విలువ 76.11 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో దిగుమతుల విలువ 43.31 బిలియన్ డాలర్లకు పెరిగింది. 
 
కాగా 2021-22లో భారత్ – చైనాల మధ్య 115.42 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగగా.. అంతకుముందు 2020-21లో 86.4 బిలియన్ డాలర్ల వాణిజ్య కార్యకలాపాలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేశాయి. భారత్- అమెరికాలు ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయించడంతో రానున్న సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ ఖాన్ స్పందిస్తూ.. భారత్‌ ఎంతో విశ్వసనీయమైన వాణిజ్య భాగస్వామిగా అవతరిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు కేవలం చైనా సప్లయిల మీద మాత్రమే ఆధారపడడం తగ్గించాయి. భారత్ లాంటి ఇతర దేశాలతో వాణిజ్యానికి మొగ్గు చూపుతున్నాయని ఆయన వివరించారు.
రానున్న కాలంలో అమెరికా- భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా నేతృత్వం ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రయత్నం ఇరుదేశాల ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  కాగా  భారత్ మిగులు వాణిజ్యం నిర్వహిస్తున్న అతికొద్ది దేశాల్లో అమెరికా కూడా ఉంది. 201-22లో అమెరికాతో భారత వాణిజ్య మిగులు విలువ 32.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
మరోవంక, చైనా- భారత్‌ల వాణిజ్యం కూడా మెరుగవుతున్నాయి. 2020-21తో పోల్చితే గతేడాది చైనాకు భారత్ ఎగుమతులు 21.25 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. మరోపక్క దిగుమతులు కూడా 94.16 బిలియన్ డాలర్లకు పెరిగాయని గణాంకాలు చెబుతన్నాయి. అంతక్రితం ఏడాది చైనాకు భారత్ ఎగుమతుల విలువ 72.91 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయని పేర్కొంది. 
 
కాగా వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 2013-14 నుంచి 2017-18 మధ్యకాలంలో భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా కొనసాగింది. చైనా కంటే ముందు యూఏఈ భారత్‌కు అతిపెద్ద భాగస్వామిగా ఉండేంది. 2021-22 మధ్యకాలంలో యూఏఈతో భారత్ 72.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం నిర్వహించి మూడవ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా(42.85 బిలియన్ డాలర్లు), ఇరాక్ (34.33 బిలియన్ డాలర్లు), సింగపూర్(30 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.