
విద్యార్ధి దశనుండే శాస్త్ర సాంకేతిక రంగం అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ పెంచుకుని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాధ్ సూచించారు. దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులను ఎంపిక చేసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిఏటా యువిక కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ నుంచి యువిక -2022 కార్యక్రమాన్ని ఇస్రో నిర్వహించింది.
దేశంలోని 36 రాష్ట్రాలకు చెందిన 153 మంది విద్యార్థులు యువిక కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇస్రోకు చెందిన 5 కేంద్రాలలో రెండు వారాల పాటు విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగింపులో భాగంగా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో షార్ డైరెక్టర్ రాజరాజన్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే విద్యార్థుల కోసం సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి వివరించారు. అదేవిధంగా షార్‌లోని ప్రయోగ వేదికల వద్దకు విద్యార్థులను తీసుకువెళ్లి రాకెట్ ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువిక – 2022 ముగింపు సందర్భంగా శనివారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాధ్ పాలుపంచుకుని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి శాస్త్రసాంకేతిక రంగంపై మక్కువ పెంచుకోవడంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఆయన చెప్పారు. 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇస్రో రూపొందిస్తున్న ఉపగ్రహా ప్రయోగాలతో దేశ ఆర్థికాభివృద్ధి మెరుగు పడడంతో పాటు సొంత పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
అనంతరం పలువురు విద్యార్థులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఎంఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్ సెంథిల్‌కుమార్, గ్రూప్ డైరెక్టర్ గోపికృష్ణ, సీబీపీఓ డైరెక్టర్ సుథీర్‌కుమార్, యువిక చైర్‌పర్సన్ అలెక్సీ తదితరులు పాల్గొన్నారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు