ఓం ప్రకాశ్‌ చౌతాలకు నాలుగేళ్ల జైలు శిక్ష

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల జరిమానా కూడా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.

ఇక ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పదేళ్ల ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన 87 ఏళ్ల చౌతాలా తిహార్‌ జైలు నుంచి గతేడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. 2000 ఏడాదిలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన  కేసులో  చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు.

1999 నుంచి 2005 వరకు హరియాణా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరున భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం 2010లో ఆయనపై సీబీఐ చార్జ్‌షీట్‌ నమోదు చేసింది. 

తాజాగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. హరియాణా ముఖ్యమంత్రిగా చౌతాలా మొత్తం 4 సార్లు పదవి బాధ్యతలు నిర్వర్తించారు