యాసిన్ మాలిక్‌కు యావజ్జీవం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్‌ ఎన్‌ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదు తో పాటు రూ. 10 లక్షల జరిమానా విధించింది. పదేళ్లు కఠిన కారాగార శిక్ష, మరో ఐదేళ్లు ఉపా చట్టం కింద శిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది.

అంతకుముందు సెక్షన్ 121 కింద యాసిన్‌ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ సెక్షన్ కింద ఉరి గరిష్ట శిక్ష కాగా.. అతి తక్కువ అంటే యావజ్జీవమే. ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

కేసు విచారిస్తున్న రాజీవ్‌ కుమార్‌ శర్మ సెలవుల్లో ఉన్నందున స్పెషల్‌ జడ్జీ ప్రవీణ్‌ సింగ్‌ తన తీర్పును వెల్లడించారు. చివరి శ్వాస వరకూ జైల్లోనే ఉంచాలని తీర్పు వెలువరించారు.

తనకు మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోరడంపై యాసిన్‌ మాలిక్‌ స్పందిస్తూ తను దేనికీ అడుక్కోనని, కేసు కోర్టులో ఉన్నందుకున దాని (కోర్టు) నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మాలిక్‌ తరపున కోర్టు విచారణకు హాజరైన న్యాయవాది మాట్లాడుతూ.. గత 28 ఏళ్లలో ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు, హింసకు పాల్పడినట్లు భారత ఇంటెలిజెన్స్ విభాగం రుజువు చేస్తే ఉరిశిక్షను అంగీరిస్తానని యాసిన్‌ చెప్పినట్లు తెలిపారు.

అదే విధంగా యాసిన్‌ ఏడుగురు ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశాడని, నేరం రుజువైతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని కూడా  చెప్పినట్లు వెల్లడించారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించి 2017లో మాలిక్‌పై ఎన్‌ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది.

భద్రతాబలగాలపైకి రాళ్లు రువ్వడం, స్కూల్స్‌ తగలపెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, దేశ విద్రోహ చర్యలకు పాల్పడడం వంటి వాటి కోసం ఉగ్రనిధులను వినియోగించినట్టు ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. 1989లో జరిగిన కశ్మీర్‌ పండిట్ల మారణహోమంలోనూ జేకేఎల్‌ఎఫ్‌ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.