ఎస్పీ రాజ్యసభ కోసం కాంగ్రెస్ వదిలిన కపిల్ సిబాల్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజ్యసభ సీట్ కోసం ఆ పార్టీకి   రాజీనామా చేశారు.  సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికలలో ఎస్పీ అధినేత  అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

రాంగోపాల్ యాదవ్, ఉత్తమ్ పటేల్ సహా పలువురు నేతలు సిబల్ వెంట ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ కపిల్ సిబల్తో పాటు జావేద్ అలీ, డింపుల్ యాదవ్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. వాస్తవానికి ఈ నెల 16 వ తేదీనే కపిల్ సిబల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అయితే ఈ విషయంపై ఈ రోజు వరకు అటు కాంగ్రెస్ గానీ, ఇటు సిబల్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

గతంలో రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పేందుకు సోనియా గాంధీ సిద్ధమైన నేపథ్యంలో కపిల్ సిబల్ సహా పలువురు పార్టీ సీనియర్లు హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ 23 పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహించిన ఈ జట్టు పార్టీలో అత్యవసరంగా నాయకత్వ మార్పు అవసరమని తిరుగుబాటు జెండా ఎగరేశారు. 

తాజాగా ఎస్పీలో చేరిన కపిల్ సిబల్ రాజీనామాపై స్పందిస్తూ కాంగ్రెస్తో 30ఏళ్ల బంధాన్ని తెంచుకోవడం అంత సులువేం కాదని చెప్పారు.  తాను స్వతంత్ర గళంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మీడియాకు తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. తనను అర్థం చేసుకున్న అఖిలేశ్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

సమాజ్‌వాదీ పార్టీ తరపున కపిల్ సిబల్‌కు రాజ్యసభ సభ్యత్వం రాబోతున్నట్లు ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ తరపున ఓ కేసులో న్యాయవాదిగా వ్యవహరించారు.  దాదాపు రెండేళ్ళు జైలులో గడిపిన ఆజం ఖాన్‌కు ఇటీవల సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది.

దీంతో సిబల్‌పై ఆజం ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్యసభ సభ్యత్వం కోసం ఎన్నికల బరిలో సిబల్‌ను నిలపడానికి తమ పార్టీ ఆలోచిస్తే తాను చాలా సంతోషిస్తానని చెప్పారు. ఆయన చాలా సమర్థుడని, ఆ పదవికి అర్హుడని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీలో చీలిక వచ్చినపుడు ఎన్నికల గుర్తు ‘సైకిల్’ అఖిలేశ్ వర్గానికి దక్కే విధంగా చేయడంలో కపిల్ సిబల్ 2017లో సఫలమయ్యారు. ఇటువంటి అంశాలు కపిల్‌కు కలిసివచ్చాయి.