అఖిలేష్ కు దూరంగా జరుగుతున్న అజాంఖాన్!

సమాజ్‌వాదీ పార్టీలో బలమైన నేతగా పేరున్న ఆజాంఖాన్ ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో తెగతెంపులు చేసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.  అజాంఖాన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. 
 
రెండేళ్లుగా జైలులో ఉన్న అజాంఖాన్‌కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో శనివారంనాడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనపై భూ ఆక్రమణలు, ప్రభుత్వాధికారులను బెదరించడం సహా డజనుకు పైగా కేసులు ఉన్నాయి.
తాత్కాలిక బెయిలుపై విడుదలైన అజాంఖాన్ తన అసెంబ్లీ నియోజకవర్గమైన రాంపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ, సొంత వ్యక్తులే తనను వంచించినట్టు ఆరోపించారు. ”నా చిక్కుల వెనుక నా సొంత మనుషులే ఉన్నారు. అలాంటి వాళ్లకు భగవంతుడు వివేకం ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని చెప్పడం గమనార్హం.
రాంపూర్‌లో ఖాన్‌ను కలుసుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి బృందం ప్రయత్నించినప్పటికీ  ఒంట్లో బాగోలేదని చెప్పి ఆయన నిరాకరించారు. జైలులో ఉండగా తనను బెదిరించారని, ఎన్‌కౌంటర్‌లో చంపేస్తానంటూ ఓ పోలీసు బెదరించాడని కూడా ఖాన్ ఆరోపించారు.  కొందరు ముస్లిం నేతలు సైతం అఖిలేష్ తమ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
అజాంఖాన్‌ను అఖిలేష్ చిన్నబుచ్చారని, సమీప భవిష్యత్తులో ఆయన (అజాంఖాన్) పార్టీని విడిచిపెట్టే అవకాశాలున్నాయని ఖాన్ సన్నిహితుడొకరు చెప్పారు. ”ఖాన్ జైలులో ఉన్న రెండేళ్లలో ఒకే ఒక్కసారి ఆయనను అఖిలేష్ కలిసారు. ఆయనను (ఖాన్) విపక్షనేతగా కూడా చేయలేదు. పార్టీలో ముస్లిం నేతలకు సీనియర్ పొజిషన్లు ఇవ్వలేదు” అని అజాంఖాన్ మీడియా ఇన్చార్జి ఫసహత్ అలియాస్ షాను ఇటీవల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలంతా గంపగుత్తగా సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేశారని, ముస్లింల మద్దతుతోనే అఖిలేష్ 100కు పైగా సీట్లు గెలుచుకున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. “ఆయన విజయం వెనుక మేము  (ముస్లింలు) ఉన్నప్పటికీ, ఇప్పుడు మా చొక్కాలు దుర్వాసన వస్తున్నట్టున్నాయి. మమ్మల్ని దగ్గరకు కూడా రానీయడం లేదు” అని ఆయన వాపోయారు.
అఖిలేష్ చిన్నాన్న, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ ఇప్పటికే అఖిలేష్‌తో తెగతెంపులు చేసుకున్నారు. అజాంఖాన్‌తో చేతులు కలిపే అవకాశాలున్నాయని శివపాల్ సింగ్ సంకేతాలు ఇచ్చారు. కాగా, అజాంఖాన్ సన్నిహితులు మాత్రం తమ నేత (ఖాన్) ఇతరులతో కలవకుండా సొంతంగానే పార్టీ పెడతరాని చెబుతున్నారు.