
హైదరాబాద్‌లో కొత్తరకం ఒమిక్రాన్ కేసు బయటపడింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 తొలి కేసు హైదరాబాద్ లో నమోదైందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ దీనిని ధృవీకరించింది. కరోనా జెనోమిక్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.
ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదు అయ్యిందని, ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లో ఈ సబ్‌వేరియెంట్ వెలుగు చూసిందని ఇన్సాకాగ్ వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో పాటు చాలా దేశాల్లో కరోనా కేసులు విజృంభణకు కారణమైంది ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్.
ఈ తరుణంలో.. తొలి కేసు వెలుగు చూడడంతో.. భారత వైద్య పరిశోధన మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. పది రోజుల క్రితం దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఓ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్‌ను ఇన్సాకాగ్కు పంపారు. పరీక్ష అనంతరం సదరు వ్యక్తిలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎ 4 రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అతనితో పాటు సమావేశంలో పాల్గొన్న 24 మందికి టెస్టులు నిర్వహించగా వారందరికీ నెగటివ్ గా తేలింది. ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన వ్యక్తిని కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి మరోసారి టెస్ట్ నిర్వహించనున్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. 10 రోజుల క్రితం నమోదైన బిఎ4 రకం ఒమిక్రాన్ కేసు భారత్ లో మొట్ట మొదటిదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.
ఈ వేరియంట్ ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు ఇప్పట్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు లేవని, అన్ని జిల్లాలలో కరోనా కిట్లు అందుబాటులో ఉంచామని శ్రీనివాస రావు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే కథనాలను పట్టించుకోవద్దని చెప్పారు. బిఎ4 లాంటి వేరియంట్స్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ సిద్దంగా ఉందని ప్రకటించారు.
ఓమిక్రాన్ లోని రెండు సబ్ వేరియెంట్లలో బీఏ.4 కూడా ఒకటి. ఇది ఆస్పత్రిపాలు జేసేంత ప్రమాదకరమైంది కాకపోయినా వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుంది. పైగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకూ ఇది సోకుతోంది. తీవ్ర ముప్పు లేనప్పటికీ.. కేసులు పెరగవచ్చని మాత్రం వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలసట, జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి ఈ వేరియెంట్ సోకిన వాళ్లలో. అయితే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నవాళ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లపై దీని ప్రభావం ప్రతికూలంగా చూపించడం చాలా దేశాల కేసుల్లో గుర్తించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము