కేసీఆర్ ఆదేశాల మేరకే దిశ  ఎన్ కౌంటర్ !

సుప్రీంకోర్డుకు శ్రీపుర్కర్ కమిటి ఇచ్చిన నివేదిక తెలంగాణ పోలీసులు అక్రమంగా చేసిన ఎన్ కౌంటర్ ను బయట పెట్టిందని చెబుతూ చూడబోతే ఈ ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకే జరిగిందని తెలుస్తోందని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు ఆరోపించారు. 
 
కేసు ఎంత తీవ్ర నేరానికి సంబంధించినది అయినా, రాష్ట్ర అధినేత ప్రయోజనాలు, అతని పార్టీ రాజకీయ అవసరాల కోసం పోలీసులను అక్రమ మార్గాల్లో సత్వర న్యాయం (ఇన్స్టెంట్ జస్టిస్) కోసం ఒత్తిడి చేయడం తగదని ఆయన హితవు చెప్పారు.  రాజ్యాంగం ప్రకారం కోర్టుల్లో సమగ్ర విచారణ జరిపి, సరైన శిక్ష విధించడానికి ఏదీ ప్రత్యామ్నాయం కాకూడదని స్పష్టం చేశారు.
 
దిశ వంటి తీవ్రమైన ఘటనల్లో కూడా నేరస్తులకు కఠిన శిక్షలు విధించడానికి చట్టాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అవసరమైతే ఉరిశిక్ష విధించే వెసులు బాటు కూడా ఉందని చెప్పారు.  అయినప్పటికీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం చాలా ప్రమాదకరం అని కృష్ణసాగర్ రావు హెచ్చరించారు. 
 
ఒకవేళ పోలీసులు ఇలానే నేరస్తులకు సొంతంగా శిక్షలు వేసే సంప్రదాయం మొదలుపెడితే, దానికి ప్రభుత్వం మద్దతు ఇస్తే, అది అడ్డూ అదుపూ లేని పోలీసు పెత్తనానికీ, లెక్కలేని అరాచకానికీ దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించేలా తెలంగాణలో అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పద్ధతిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన స్పష్టం చేశారు.