అది కుతుబ్‌మినార్‌ కాదు.. సూర్య గోపురం

అది కుతుబ్‌మినార్‌ కాదు.. సూర్య గోపురం
తాజ్‌మహల్‌ కాదు తేజో మహల్‌ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్‌ మినార్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్‌ అధికారి. అది కుతుబ్‌ మినార్‌ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు.
ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేగాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్‌ మినార్‌ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్‌ అలల్‌ దిన్‌ ఐబాక్‌ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇది కతుబ్‌మినార్‌ కాదు సూర్యగోపురం (అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్‌లో పలుమార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉందని జూన్‌ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు.

కుతుబ్‌మినార్‌ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రి పూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.