కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి రెండేళ్లు పొడిగించాలి 

కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు మరో రెండేళ్లు వయోపరిమితి పొడిగించాలనే నిరుద్యోగుల డిమాండ్ కు మద్దతు తెలుపుతూ ఈ విషయమై వారితో కలసి ఆందోళనలో పాల్గొంటామని, డీజీపీ కార్యాలయంను కూడా ముట్టడిస్తామని బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ వెల్లడించారు.  అదే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు ఉన్న గడువును మరో 15 రోజులు పొడిగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
 
రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంది అని చెప్పి  పిఆర్సి నివేదిక రాగా తాము చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని  ప్రకటించగా, ఇప్పటి వరకు  30 వేల ఉద్యోగాలకు మాత్రమే ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించిందని ఆయన తెలిపారు.  
వాటితో పాటుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర శాఖ నుంచి అనుమతి తీసుకొని వెంటనే వాటిని భర్తీ చేయాలని యువమోర్చా డిమాండ్ చేసింది.
ఇప్పటి వరకు ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలలో ఎక్కువ భాగం కానిస్టేబుల్ ఉద్యోగాలే అని చెబుతూ అనేక సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయని కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం తోడవడంతో సుమారు నాలుగు లక్షల మంది యువకులు వయోపరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అనర్హులుగా మారారని ఆయన పేర్కొన్నారు.
ఈ కారణంగా మీరు మూడు సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వయోపరిమితిని సడలించారని చెబుతూ, మరో రెండు సంవత్సరాలు అదనంగా సవరించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక పోయిన వారందరికీ అవకాశం కల్పించాలని భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. 
 
కాగా, గత  20 రోజులుగా రాష్ట్రంలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోలీస్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయిందని వయోపరిమితిని సడలించాలని ఎన్నో పోరాటాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే వారిని పోలీస్ స్టేషన్లో బందిస్తూ, కనీసం భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క యువకునికి అన్యాయం జరిగినా కూడా యువమోర్చా ప్రత్యక్ష పోరాటం చేసి వారి పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులతో, కానిస్టేబుల్ అభ్యర్థులు వారందరితో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు.  అందుకోసమే, డిజీపీ కార్యాలయం ముట్టడించబోతున్నామని, టిఎస్పిఎస్సి కార్యాలయం ముట్టడించ బోతున్నామని తెలిపారు.