అస్సాం, అరుణాచల్ ల్లో భారీ వర్షాలు — 10 మంది మృతి 

అసోం, అరుణాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా మూడు రోజుల్లో 10 మంది చనిపోయారు.
 
ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో మూడు రోజుల్లో వరదలు వెల్లువెత్తిన సంఘటనల్లో అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలో 10 మంది మరణించారని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపారు. గౌహతిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అసోం ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ సరిహద్దు గోడ కూలిపోయింది.
 
సోమవారం సాయంత్రం విడుదల చేసిన అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం, శుక్రవారం నుండి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య ఐదుకి చేరుకుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 200,000 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. 
 
దాదాపు 33,000 మంది నిర్వాసితులైన ప్రజలు ప్రభావితమైన ఐదు జిల్లాల్లో సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరద నీటితో 16,000 హెక్టార్లకు పైగా పంట నీట మునిగిందని నివేదిక పేర్కొంది.
 
దిమా హసావో జిల్లాలో మూడ్రోజులుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. అక్కడ 12 గ్రామాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి.  పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. వర్షాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

భారీ వర్షాలకు రైలు ట్రాకులు కొట్టుకపోయాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేసింది అక్కడి రైల్వే శాఖ. అయితే.. అప్పటికే బయలుదేరిన రెండు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణీకులు తీవ్ర భయాందోనలకు గురయ్యారు. వారిని రక్షించేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

డిటోక్ చెర్రా స్టేషన్ లో చిక్కుకున్న 1, 245 మందిని బదార్ పూర్, సిల్చర్ రైల్వే స్టేషన్ లకు తరలించారు. మరో 119 మందిని సిల్చర్ కు తరలించింది. వారికి కావాల్సిన సౌకర్యాలను అధికారులు కల్పిస్తున్నారు.

మైబాంగ్, మహూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో కొన్ని గంటల పాటు రైల్వే సేవలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న ట్రాక్ లను సరిచేసేందుకు రైల్వే బృందాలు చర్యలు తీసుకున్నాయి.ఆర్మీ, పారామిలటరీ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగారు.

సహాయక చర్యలు ముమ్మరం చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అసోం వరదలపై కేంద్రం సమీక్షించింది. రాష్ట్రానికి తక్షణ సాయంగా 125 కోట్లను విడుదల చేసింది. వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అధికారుతో సమీక్ష చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.ఈ ఘటనల్లో మరో ఆరుగురు గాయపడ్డారు. ఈశాన్య ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లో మే 1 నుంచి 16 వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.  మణిపూర్‌లో, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులు మూసుకుపోయాయి.  మణిపూర్‌లో గత వారంలో ఎడతెరిపిలేని వర్షాలు మణిపూర్ అంతటా విధ్వంసం సృష్టించాయి.
 
గౌహతిలోని ఐఎండి కార్యాలయం ప్రకారం, ఈశాన్య ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల్లో మే 1 నుండి మే 16 వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మేఘాలయలో 115 శాతం, అస్సాంలో 49 శాతం, మణిపూర్‌లో 27 శాతం, నాగాలాండ్‌లో 18 శాతం,  అరుణాచల్ ప్రదేశ్‌లో 11 శాతం నమోదయ్యాయి. 
 
ఈ కాలంలో సాధారణం కంటే త్రిపురలో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, మిజోరంలో 41 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. “బంగాళాఖాతం నుండి బలమైన దిగువ-స్థాయి దక్షిణ/నైరుతి గాలుల కారణంగా తేమ చొరబాటు కారణంగా మేము భారీ వర్షపాతాన్ని చూస్తున్నాము. గతంలో కూడా మే నెలలో ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేవి” అని భారత వాతావరణ శాఖ గౌహతి కార్యాలయంలోని శాస్త్రవేత్త సునీత్ దాస్ తెలిపారు.