ఓటర్లకు అధునాతన సేవలను అందించాలి 

ఓటర్లకు అధునాతన సేవలను అందించాల్సిన అవసరముందని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ (సిఈసి) సుశీల్‌ చంద్ర తెలిపారు. రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రణాళిక, వ్యయ పర్యవేక్షణ, ఎలక్టోరల్‌ రోల్‌, ఐటి అప్లికేషన్లు, డేటా మేనేజ్‌మెంట్‌, ఈవిఎం, వివిప్యాట్‌, ఫిర్యాదుల సకాలంలో పరిష్కారం, స్వీప్‌ స్ట్రాటజీ అండ్‌ ఓటర్‌ ఔట్రీచ్‌, మీడియా, కమ్యూనికేషన్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. 

రిజిస్ట్రేషన్‌ నుండి ఓటింగ్‌ వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపరచాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ఈసి రాజీవ్‌ కుమార్‌ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఆయన నాయకత్వంలో ఈసిఐ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ, రాజ్యాంగం అందించిన ఆదేశంతో భారత ఎన్నికల కమిషన్‌ చాలా పటిష్టమైన అంతర్గత యంత్రాంగాలను, పద్ధతులను అభివద్ధి చేసిందని పేర్కొన్నారు. క్లిష్టమైన పరిస్థితిల్లో డైనమిక్‌ నిర్ణయాలను తీసుకోవాలని, తప్పుడు సమాచారంతో కూడిన కథనాలను అరికట్టాలని ఆయన కోరారు. 
 
ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించాలని చెప్పారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల నిర్వహణ అధికారులు ఈ ముగ్గురి భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ఐటి మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచాలని సూచించారు. 
 
ఎన్నికల కమీషనర్‌ అనూప్‌ చంద్ర పాండే కూడా ఈ సదస్సులో మాట్లాడారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్లు, సీనియర్‌ డిఇసిలు, డిఇసిలు, డిజిలు, కమిషన్‌లోని ఇతర సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.