ఎఫ్‌సిఆర్‌ఎ ఉల్లంఘనలో 14 మంది అరెస్ట్

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) 2010ని ఉల్లంఘిస్తూ విదేశీ విరాళాలను సేకరించిన హోం శాఖ అధికారులు, ఎన్‌జిఒ ప్రతినిధులు, ఇతర అధికారులుతో కలిపి సుమారు 14 మందిని సిబిఐ అరెస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా రూ 3.21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 
 
ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, కొయంబత్తూర్‌, మైసూర్‌, రాజస్తాన్‌ సహా 40 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టింది. ఎన్‌జిఒ, మరేదైనా అసోసియేషన్‌ విదేశీ నిధులను స్వీకరించడానికి ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ లేదా లైసెన్స్‌ తప్పనిసరి. 
 
ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ల పునరుద్ధరణ, లైసెన్స్‌ల రద్దును నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎన్‌జిఒలు, ఇతర సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సమాచారం. 
 
కేంద్ర హోంశాఖ నుండి ఫిర్యాదు రావడంతో సిబిఐ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు హోంశాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. సుమారు 12 మందికి పైగా ప్రభుత్వ అధికారులను, ఇతర అధికారులను సిబిఐ విచారంచినట్లు వివరించారు. లంచాలు తీసుకుంటూ దొరికిన వారు ఉన్నారని, మరికొంతమందిని అరెస్ట్‌ చేయనున్నట్లు తెలిపారు. హవాలా మార్గాల ద్వారా సుమారు 2 కోట్లు లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఐరీస్ మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీ, సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, మహ్మద్ జహంగీరాబాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, క్రిస్టియన్ లైఫ్ సెంటర్ మినిస్ట్రీస్, హార్వెస్ట్ ఇండియా, రిఫార్మ్డ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ నార్త్ ఈస్ట్ ఇండియా, నయీ రోష్ని ఫౌండేషన్, ఒమిద్యార్‌ల ప్రతినిధులపై ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది.