సిద్దరామయ్యకు జైలు తప్పదు… బిజెపి

అర్కావతి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి అవినీతి తేలితే ప్రతిపక్షనేత , మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జైలుకు వెళ్లకు తప్పదని బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ స్పష్టం చేశారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల అక్రమాలలో 80 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారని ఆరోపించారు. 
 
అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ కు రెండు ముఖాలని ధ్వజమెత్తారు. అత్యంత ఎక్కువ అక్రమాలు జరిగింది సిద్దరామయ్య పాలనలోనే అని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల హుబ్లాట్‌ వాచ్‌ను ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య తీసుకున్నారంటే ఇక అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
 
తలగడలలోనూ దిగమింగిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విషయం తెలియదా అని ప్రశ్నించారు. అర్కావతి డీ నోటిఫికేషన్‌లో కెంపణ్ణ కమిషన్‌ నివేదిక బయటకు వస్తే సిద్దరామయ్య జైలుకు వెళతారని తెలిపారు. ప్రియాంక ఖర్గే ఎస్‌ఐ పోస్టుల అక్రమాలపై రోజూ మాట్లాడారని, ఆయన తండ్రి ఎలా సంపాదించారో బహిరంగంగా చెబితే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. 
 
 హిట్‌ అండ్‌ రన్‌ ఆరోపణలు కాదని వాస్తవాలు ఆధారాలతో చెబితే దర్యాప్తు మరింత తీవ్రంగా సాగుతుందని స్పష్టం చేశారు. డీజే హళ్లి, హుబ్బళ్లిలో మత ఘర్షణలను సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు అదుపులో ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం వెంటాడుతుండడంతో కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.