నాగరాజు పరువు హత్యపై సమగ్ర దర్యాప్తు… గవర్నర్ కు వినతి

 సరూర్ నగర్  లో ముస్లిం యువతిని వివాహం చేసుకున్నందుకు దారుణంగా హత్యకు గురైన దళిత యువకుడు మలప్పురం నాగరాజు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డీజీపీని ఆదేశించాలని బిజెపి ప్రతినిధి వర్గం రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై  సౌందరరాజన్ కు విజ్ఞప్తి చేసింది. 
 
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో గవర్నర్ ను కలిసిన రాష్ట్ర బిజెపి ఎస్సి మోర్చా ప్రతినిధి వర్గం ఇప్పటి వరకు బాధితులకు అండగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తూ ఉండడంతోనే ఇటువంటి హత్యలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఈ దాడి హిందూ యువకుడితో తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న మహిళ శ్రీమతి సయ్యద్ అష్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు చేసిన ‘పరువు హత్య’ తప్ప మరొకటి కాదని వారు స్పష్టం చేశారు. తమ వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయిపై శత్రుత్వం పెంచుకున్న ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు మత విద్వేషంతో చేసిన దాడిగా కూడా ఈ దాడి కనిపిస్తోందని పేర్కొన్నారు.
 
సంఘటన జరిగిన సమయంలో అక్కడున్నవారు పట్టుకొని, తర్వాత వచ్చిన పోలీసులకు అప్పచేప్పిన వారిని తప్ప పోలీసులు ఇప్పటివరకు మరెవ్వరినీ అరెస్ట్ చేయలేదని వారు గుర్తు చేశారు. ఘటన జరిగి మూడు రోజులు గడిచినా మిగిలిన నిందితులను పెట్టుకునేంత తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్లు  కనిపించకపోవడం లేదని విమర్శించారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి సంతృప్తి పరచేందుకు ప్రయత్నిస్తున్న వర్గానికి చెందిన వారు కావడంతో నిందితుల పట్ల పోలీసుల నిష్క్రియాత్మకతను ఇది తెలియజేస్తోందని వారు ఆరోపియన్చారు. చాలా బలహీనమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ద్వారా పోలీసులు కేసును నీరుగార్చే అవకాశం ఉందని బీజేపీ ఎస్సీ మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ పరిస్థితుల్లో గవర్నర్ జోక్యం చేసుకొని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును తార్కిక ముగింపుకు తీసుకువెళ్లి, అక్రమార్కులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా రాష్ట్ర డిజిపిని ఆదేశించాలని వారు కోరారు.  అదేవిధంగా, బాధిత కుటుంబం చాలా వెనుకబడిన ఎస్సీ వర్గానికి చెందినందున, తక్షణమే ఆర్థిక సహాయం చెల్లించాలని ఆదేశించాలని,  కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇతర సహాయం అందించాలని ఆదేశించారని విజ్ఞప్తి చేశారు. 
 
గవర్నర్ ను కలసిన వారిలో ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, జాతీయ సఫాయి కమీషన్ మాజీ సభ్యులు చింత సాంబమూర్తి, ఎస్సి కమీషన్ మాజీ సభ్యులు ఎస్ రాములు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మాజీ మంత్రులు ఎ చంద్రశేఖర్, పి బాబూమోహన్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అస్ఫర్ పాషా, జాతీయ కార్యదర్శి ఎఫ్ ఎస్ లాయక్ అలీ తదితరులు ఉన్నారు.