కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన రోజున, శుక్రవారం ఉదయం 27 ఏళ్ల బిజెపి కార్యకర్త ఒకరు పాడుబడిన భవనంలో అనుమానాస్పద పరిస్థితులలో శవమై కనిపించాడు. మృతుడు అర్జున్ చౌరాసియాగా గుర్తించారు.
ఉత్తర కోల్‌కతాలోని ఘోష్ బగన్ ప్రాంతంలోని భవనంలో ఉరి వేసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. ఆయన బీజేపీ యువమోర్చా కార్యకర్త. పోలీసులు మృతదేహానికి సమీపంలో ఎటువంటి సూసైడ్ నోట్‌ను కనుగొనలేదు. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని తీసుకువెళుతున్నప్పుడు భారీ నిరసనలను ఎదుర్కొన్నారు. సంఘటనా స్థలంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) జోయితా బసు ఉన్నారు.
“మాకు న్యాయం కావాలి. అతను సంతోషకరమైన వ్యక్తి. నేను పోలీసులను నమ్మను. వారు ఉదయం 7 గంటలకు వచ్చారు, నా సోదరుడు 2 గంటలకు మరణించాడు,” అని అర్జున్ అక్క సునీతా చౌరాసియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన పట్ల అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన రాక సందర్భంగా మధ్యాహ్నం విమానాశ్రయం వద్ద తనకు భారీ స్వాగత సన్నాహాలు పలికేందుకు జరిపిన ఏర్పాట్లను రద్దు చేయవలసిందిగా ఆయన పార్టీ నేతలకు సూచించారు.
వరుస ట్వీట్లలో, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ దీనిని “రాజకీయ హత్య” అని స్పష్టం చేశారు. “అభిజిత్ సర్కార్ తర్వాత, అర్జున్ చౌరాసియా అనే మరో 26 ఏళ్ల బిజెపి కార్యకర్తను టిఎంసికి చెందిన #రాజకీయ ఉగ్రవాదిలు హత్య చేశారు. అతని చంపి, ఉరివేశారు, ” అని ఆరోపిస్తూ ఘోష్ ట్వీట్ చేశారు.
“పశ్చిం బంగాను సందర్శిస్తే తాను హత్యకు గురయ్యే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా నిన్న అన్నారు. రాజకీయ హత్యల పరంపరను కొనసాగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని టిఎంసి కృతనిశ్చయంతో ఉంది” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన బీజేపీ ఎంపీ సుభాష్ సర్కార్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈరోజు కోల్‌కతాలో హోంమంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు చౌరాసియా బైక్ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని సర్కార్ చెప్పారు.
“కాశీపూర్ అసెంబ్లీ నివాసి అయిన నిబద్ధ కలిగిన మా కార్యకర్త అర్జున్ చౌరాసియా (27) మరణం, హత్య చాలా బాధ కలిగించింది. దురదృష్టవశాత్తు హత్య దృష్ట్యా, కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు అన్ని వేడుకలు రద్దు చేసుకున్నాము” అని పశ్చిమ బెంగాల్ బిజెపి ట్వీట్ చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్