దేశ రాజధానిలోని ఢిల్లీ విమానాశ్రయం అరుదైన గుర్తింపు దక్కించుకుంది. మార్చిలో అత్యధికంగా వాణిజ్యం జరిగిన విమానాశ్రయాల జాబితాలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణపరంగా ఈ ఘనతను సాధించింది.
ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణాల డేటా అందించే అఫీషియల్ ఎయిర్‌లైన్ గైడ్(ఓఏజీ) ఇటివల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగిన ఎయిర్‌పోర్టుల్లో అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయం మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.
రెండో స్థానంలో ఉన్న దుబాయ్ విమానాశ్రయం మూడో స్థానంకు పరిమితం కాగా, ఆ స్థానాన్ని ఢిల్లీ విమానాశ్రయం ఆక్రమించింది. కరోనాకు ముందు మార్చి 2019లో అత్యంత రద్దీ కలిగిన ఎయిర్‌పోర్టుల జాబితాలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ 23వ స్థానంలో నిలిచిందని ఈ నివేదిక ప్రస్తావించింది.
కరోనా విపత్తు కారణంగా విధించిన ఆంక్షలు రెండేళ్ల పాటు ప్రయాణాలను తీవ్రంగా దెబ్బతీశాయి. అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ పూర్తయిన ప్రయాణికుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా ఆంక్షలను సడలించాయి.
దీంతో మార్చి 2022లో అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్ 4.42 మిలియన్ల ప్రయాణికులను, భారత్‌లోని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ 3.61 మిలియన్ల మంది, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ 3.55 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని ఆ నివేదిక తెలిపింది. ట్రావెల్, టూరిజం విభాగాలు తీసుకుంటున్న చర్యలతో ప్రయాణాలు పెరుగుతున్నాయని నివేదిక విశ్లేషించింది.

More Stories
రష్యా చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలతో భారత్ కు ముప్పు?
త్రివిధ దళాలకు రూ.79 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లు
మెహుల్ చోక్సీ అప్పగింతలో అడ్డంకులు లేవన్న బెల్జియం కోర్టు