తెలంగాణ `ది రైజ్ ఆఫ్ ఆల్కహాల్’ … బిజెపి ఎద్దేవా

తెలంగాణ `ది రైజ్ ఆఫ్ ఆల్కహాల్’ … బిజెపి ఎద్దేవా
 ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల అసమర్థ పరిపాలనలో  తెలంగాణ `ది రైజ్ ఆఫ్ ఫీనిక్స్’ గా కాకుండా,    తెలంగాణ `ది రైజ్ ఆఫ్ ఆల్కహాల్’  అని తమ ప్రకటనల శీర్షికలను  మార్చుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎద్దేవా చేసింది.  హైదరాబాద్ నగరంలో  భారీ ఎత్తున దొరుకుతున్న కొకైన్, అలాగే తెలంగాణ రాష్ట్రానికి పెద్దయెత్తున సరఫరా అవుతున్న అక్రమ డ్రగ్స్ పరిమాణం పట్ల బిజెపి తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు  దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 
 
మే 1 వ తేదీన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ వారు రూ  80 కోట్ల విలువైన దాదాపు 8 కిలోల కొకైన్ ను సీజ్ చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ రోజూ అదే పనిగా తెలంగాణ తమ నాయకత్వంలో గొప్ప అభివృద్ధి ని సాధించిందని విస్తృతమైన ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
అంతేకాదు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియాలో తెలంగాణ `ది రైజ్ ఆఫ్ ఫీనిక్స్’ పేరుతో ప్రకటనలు కూడా ఇస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు.  రాష్ట్రాన్ని పాలిస్తున్న టి ఆర్ ఎస్ ప్రభుత్వం తమ రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకోవడం కోసమని క్రమంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలను బాగా పెంచుతుందని పేర్కొన్నారు.
ఎక్కడ పడితే అక్కడ లక్షలాదిగా వైన్ షాప్ లకి బార్ లకు అనుమతులు  ఇస్తున్నారని చెబుతూ దానివల్ల సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రావు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమాజంలోని కింది స్థాయి అల్పాదాయ వర్గాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. .


లక్షలాది పేద,దిగువ మధ్యతరగతి కుటుంబాలు అందులో ఉండే ఆడ, మగ కూడా మద్యానికి బానిసలై పోతున్నారని కృష్ణసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు. చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని,  సామాజికంగానూ ,ఆరోగ్యపరంగానూ,ఆర్థికంగానూ అటు భార్యాభర్తల వివాహ సంబంధాల పరంగానూ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన వివరించారు.

లక్షలాదిమంది యువత ముఖ్యంగా హై స్కూల్ వయస్సు నుండే మద్యానికి, గంజాయికి బానిసలవుతున్నారని రావు తెలిపారు. కొకైన్ లాంటి హై గ్రేడ్ సింథటిక్ డ్రగ్స్ కూడా చాలా పెద్ద యెత్తున హైదరాబాద్ నైట్ లైఫ్ లో అందుబాటులో కి వచ్చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సంస్థలైనటువంటి డిఆర్ఐ  కానీ, ఎన్ సి బి  కానీ,  కస్టమ్స్ లాంటి వాళ్ళు హైదరాబాద్ డ్రగ్స్ మార్కెట్ బాగా పెరుగుతుందని దేశంలోనే నంబర్ వన్ అవుతుందని చెప్తూనే వస్తున్నారని ఆయన హెచ్చరించారు.

ఏళ్ల తరబడి మహమ్మరిలా పెరిగిపోతున్న ఈ డ్రగ్స్ కల్చర్ ని  కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని బిజెపి నేత స్పష్టం చేశారు.  అసలు గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలు కేసులు పెట్టడం విచారణ చేస్తున్నట్లు మీడియా ముందు హడావుడి చేయడం తరువాత ఎలాంటి చర్యలు లేకుండా సైలెంట్ అయిపోవడం జరుగుతున్నదని ఆయన గుర్తు చేశారు. 

 
 ఇట్లా అటు కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్న వారిని, అమ్మే వాళ్ళని పెద్ద డ్రగ్స్ సిండికేట్స్ ని కూడా అనేక సార్లు పట్టుకుని హడావుడి చేసీన సందర్భాలు అనేకంగా ఉన్నాయని చెప్పారు. అసలు ఆ కేసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందో స్వయంగా చెప్పవలసిన బాధ్యత సీఎం కేసీఆర్ పైన ఉందని బీజేపీ డిమాండ్ చేసింది.

అసలు సమాజాన్ని చిన్నాభిన్నం చేసే ఇంత దారుణమైన డ్రగ్స్ అనే సమస్య మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందో కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కృష్ణసాగరరావు స్పష్టం చేశారు. అసలు ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి కానీ విశ్వసనీయత కానీ ఉన్నాయా..? అని ఆయన ప్రశ్నించారు.

అసలు మొత్తం ఈ ప్రభుత్వ వైఖరి,వ్యవహారం చూస్తుంటే, తెలంగాణ లో ఇంత భారీగా డ్రగ్స్ పెరిగిపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి సంబంధం ఉన్న ప్రభుత్వంలో భాగస్వాములైన టువంటి  శక్తివంతమైన వ్యక్తులకు ఎవరికైనా ఈ వేల కోట్ల రూపాయల అక్రమ డ్రగ్స్ వ్యాపారం లో సంబంధం ఉందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే పోలీసులు అంత పెద్దగా పట్టించుకోకుండా తూ తూ మంత్రంగా పని చేస్తున్నట్లు అనిపించక మానదని తేల్చి చెప్పారు.