 
                బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గత 19 రోజులుగా జరుపుతున్న రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడానికి బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా ఈ నెల 5న వస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగసభ జరపడం కోసం బిజెపి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ నెల 14న మహేశ్వరంలో ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
జేపీ నడ్డా ఈనెల రాబోతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ సభను విజయవంతం జరిపేందుకు సంజయ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలతో ఆదివారం పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలతోపాటు ఆయా జిల్లాల పదాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతున్న తీరు తెన్నులు, ప్రజల నుండి వస్తున్న స్పందన తో పాటు ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న వైనంపై సమావేశంలో చర్చించారు. పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సంజయ్ విజయవంతమయ్యారని నేతలు పేర్కొన్నారు.
పాలమూరులో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించడంతోపాటు ఒక్కో రోజు ఒక్కో అంశాన్ని లేవనెత్తుతూ ఇటు జిల్లా, అటు రాష్ట్ర ప్రజల ద్రుష్టిని ఆకర్షిస్తున్నారని, ఇదే పంథాను కొనసాగించాలని సూచించారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభలు ఒకదానికి మించి మరొకటి విజయవంతం అయ్యాయని భావించారు.
ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా కేంద్రంగా ఈనెల 5న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కు జేపీ నడ్డా వస్తున్నందున ఈ సభ ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యేలా చేద్దామని సంజయ్ సూచించారు.





More Stories
అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై బీజేపీ ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్
తెలంగాణపై మొంథా పంజా.. జలదిగ్బంధంలో వరంగల్