రూ. 7 కోట్ల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తుల జప్తు

రూ. 7 కోట్ల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తుల జప్తు
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ. 7.23 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జప్తు చేసింది.
 
 బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి నేరాలకు పాల్పడిన సుకేష్ చంద్రశేఖర్, ఇతరులు బహుమతిగా ఇచ్చిన రూ. 7.12 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు, రూ. 15 లక్షల నగదును పిఎంఎల్‌ఎ నిబంధనల కింద 36 ఏళ్ల జాక్వెలిన్ నుంచి ఇడి జప్తు చేసింది. 
 
ఈ నిధులను నేరాల ద్వారా సంక్రమించిన డబ్బుగా ఇడి పేర్కొంది. ఇందులో రూ. 5.71 కోట్లను సుకేష్ చంద్రశేఖర్ వివిధ బహుమతుల రూపంలో జాక్వెలిన్‌కు అందచేశాడు. ఇవి చేరవేసేందుకు తనవద్ద ఎంతోకాలంగా పనిచేస్తున్న పింకీ ఇరానిని చంద్రశేఖర్ వాడుకున్నాడు. 
 
పింకీని కూడా ఈ కేసులో సహనిందితురాలిగా ఇడి చేర్చింది. వీటితోపాటు అవతార్ సింగ్ కొచ్చార్ అనే అంతర్జాతీయ హవాలా ఆపరేటర్ ద్వారా జాక్వెలిన్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు రూ. 1.17 కోట్ల రూపాయల విలువైన నిధులు అందాయని ఇడి పేర్కొంది.