అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మిగిలిన 63,425 పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు? ఆ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తూ కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ వ్రాసారు.
బిజెపి ప్రజా సంగ్రామ యాత్రలో అనేక చోట్ల నిరుద్యోగ యువత పోస్టుల భర్తీలో ప్రభుత్వ జాప్యంపై తన దృష్టికి తీసుకొచ్చారని చెబుతూ ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం కేవలం పోలీస్‌శాఖలో రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీచేసి విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశామని డబ్బా కొట్టుకోవడం కాదనిదుయ్యబట్టారు .
రాష్ట్రంలో ఖాళీగా వున్న పోస్టులు భర్తీ చేసేవరకు విద్యావంతులైన యువతకు బిజెపి అండగా వుంటుందని, వారి కోసం పోరాటం చేస్తుందని సంజయ్ స్పష్టం చేశారు. 80,039 పోస్టులకు ఉద్యోగ నియామకాలు చేపడతామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి 45 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ కేవలం పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కేవలం పోలీసుపోస్టుల మాత్రమే భర్తీ చేస్తూ ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఇంకా రెండు నెలల్లో ప్రారంభమవుతుందని చెబుతూ వాస్తవానికి రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో టీచర్లు లేక విద్యావ్యవస్థ అస్థవ్యస్థంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రప్రభుత్వం ప్రప్రథమంగా టీచర్ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని, అందుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావాలంటే టెట్ పరీక్ష నిర్వహించాల్సి వుందని చెప్పారు. అయితే, జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగే నాటికి సగం విద్యాసంవత్సరం పూర్తవుతుందని సంజయ్ తెలిపారు.
రాష్ట్రంలో బిస్వాల్ కమిటి నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖల్లో 1 లక్షా 91 వేల పోస్టులు ఖాళీగా వున్నాయని, కానీ మీరు 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారని సంజయ్ మండిపడ్డారు. ఇక, నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
More Stories
ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మీడియా
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?