మీకొచ్చిన పదవులు బీజేపీ పెట్టిన భిక్షయే!

మీకొచ్చిన పదవులు బీజేపీ పెట్టిన భిక్షయే!

టీఆర్ఎస్ పెట్టిన భిక్షవల్లే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బిజెపి  రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ అరేయ్ పిచ్చోడా… ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నీతివంతమైన పాలన అందిస్తున్న పార్టీ. మీది తోక పార్టీ. దొంగ దీక్షలు, దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ” అంటూ ఏద్దేవా చేశారు.

సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజున 100 కిమీ పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మక్తల్ నియోజకవర్గం క్రిష్ణంపల్లి చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు  పూలు చల్లి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని, వందల మంది యువకులు చనిపోతుంటే… మీరు బలిదానం చేయొద్దు. తెలంగాణ రాబోతుందంటూ ప్రకటన చేయడమే కాకుండా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి సుష్మాస్వరాజ్ అని గుర్తు చేశారు. ఆనాడు సుష్మస్వరాజ్ ను తెలంగాణ ఆడ పడుచుగా పొగిడిన కేసీఆర్ ఈరోజు కనీసం ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం సిగ్గు చేటని విమర్శించారు.

తెలంగాణ రావడంవల్లే కేసీఆర్ కు సీఎం, ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చాయని గుర్తు చేస్తూ  టీఆర్ఎసోళ్లకు పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కేసీఆర్ అరాచకాలపై పోరాడదాం రండి, ఎత్తిన జెండా దించకండి, తెగించి కొట్లాడండి, గొల్ల కొండ కోటపైన కాషాయ జెండా ఎగరేసేదాకా ఉద్యమిద్దాం అంటూ సంజయ్ పిలుపిచ్చారు. 

మండు టెండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజు ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయే దాకా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద బహిరంగ సభలకు ప్రాధాన్యతనిచ్చిన బీజేపీ ఈసారి మాత్రం ‘ప్రజల గోస – బీజేపీ భరోసా’ పేరిట ప్రతిరోజు సగటున మూడు, నాలుగు గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు.

సాయంత్రం పూట పాదయాత్రలో దారి వెంట దుకాణాల వద్దకు వచ్చి  చాయ్ పే చర్చ పేరిట యువకులు, వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులు సైతం ఈ యాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తూ సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొనడం విశేషం. 

రెండో విడత పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ సింగ్ పపటేల్ పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై వచ్చి బండి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ పాదయాత్ర చేశారు.  విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసీయులు  సైతం బండి సంజయ్ కు మద్దతు తెలుపుతుండం విశేషం. 10వ రోజు పాదయాత్రలో భాగంగా సుమారు 50 మంది ప్రవాసీయులు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో నడిచారు.