ఉపరాష్ట్రపతికి సైబర్ నేరగాళ్ల బెడద!

ఇటీవల ఇంటర్నెట్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్ల దోపిడీకి అవధులు లేకుండాపోయింది. అవాక్కయ్యేలా పలురకాలుగా ఇంటర్నెట్‌ ను తెలివితేటలతో వాడి దోపిడీకి తెరలేపుతున్నారు. ఇటీవల కొత్తరకం దోపిడీ వెలుగుచూసింది. 

వాట్సాప్‌ ప్రొఫైల్‌ లో ప్రముఖుల ఫొటోలను పెట్టిన నెంబర్ల నుండి కాల్స్‌, మెసేజ్‌లు వెళ్లడం.. అది నిజమని నమ్మినవారు దోపిడీకి గురవ్వడం జరుగుతోంది. ఆ ప్రొఫైల్‌ ఫొటోలలో పోలీసులు, అధికారులు, చివరికి.. ఉప రాష్ట్రపతి కూడా ఉండటం విశేషం. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల నకిలీ సందేశాల బెడద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకూ తప్పలేదు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేరుతో ఓ వ్యక్తి విఐపిలతో కొందరు వ్యక్తులకు వాట్సాప్‌ సందేశాలు పంపుతూ ఆర్థిక సాయాన్ని కోరుతున్నాడు. ఈ విషయాన్ని శనివారం ఉప రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.

94390-73183 మొబైల్‌ నంబరుతో ఈ సందేశాలు పలువురికి వెళ్లాయి. విషయం ఉప రాష్ట్రపతి దృష్టికి  వెళ్లడంతో ఆయన వెంటనే తన సచివాలయం ద్వారా కేంద్ర హౌం శాఖను అప్రమత్తం చేశారు. ఇలాంటి సందేశాలు మరిన్ని నంబర్ల నుంచి వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు.

గతంలో బెంగళూరుకు చెందిన సుకేష్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి చాలా నగరాల్లో ధనవంతులను మోసం చేశాడు. ఉద్యోగాల పేరుతో మరికొందరిని మోసం చేసి డబ్బు దండుకున్నాడు. రాజకీయ నాయకుడికి బంధువునని చెబుతూ.. 100 మందికి పైగా రూ.75 కోట్ల మేర టోకరా వేసినట్లు సమాచారం.

ముంబైలోని మలాడ్‌లో నివసిస్తున్న 71 ఏళ్ల వ్యక్తికి సోమవారం మధ్యాహ్నం వచ్చిన ఫోన్‌ కాల్‌లో ఏముందంటే…” నేను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా మాట్లాడుతున్నాను. మీ న్యూడ్‌ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం జరిగింది. వెంటనే తొలగించకపోతే అరెస్టు చేస్తాం. రాహుల్‌ శర్మ అనే వ్యక్తిని సంప్రదించండి ” అని ఉంది. 

అతను వీడియోను తీసివేసి, ఇమెయిల్‌ ద్వారా నిర్ధారించడంలో చేస్తాడని ఫోన్‌లో చెప్పి వీడియోను తొలగించే పేరుతో వృద్ధుడి నుండి రూ 1.4 లక్షలను తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు సైబర్‌ క్రైమ్‌ రూపంలో మోసపోయానని గుర్తించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.