
ఉన్నత విద్య కోసం పాకిస్థాన్ వెళ్ళొద్దని భారతీయ విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) హెచ్చరించాయి. మన దేశంలో ఉన్న, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు పాకిస్థాన్ వెళ్ళొద్దని స్పష్టం చేస్తూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
పాకిస్థాన్‌లో డిగ్రీ చదివితే, భారత దేశంలో ఉద్యోగాలకు, ఉన్నత విద్యాభ్యాసానికి అర్హులు కాదని తెలిపాయి. అయితే పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారత దేశానికి వచ్చి, భారతీయ పౌరసత్వం పొందినవారికి మినహాయింపు నిచ్చాయి.
ఉన్నత విద్యాభ్యాసం కోసం పాకిస్థాన్‌కు వెళ్లొద్దని సంబంధితులందరికీ చెప్తున్నట్లు ఈ సంయుక్త సర్క్యులర్ పేర్కొంది. భారత జాతీయులు/విదేశాల్లోని భారత పౌరులు పాకిస్థాన్‌లోని డిగ్రీ కళాశాలలు, విద్యా సంస్థల్లో పొందిన విద్యార్హతల ఆధారంగా భారత దేశంలో ఉద్యోగం లేదా ఉన్నత విద్యను పొందేందుకు అర్హులు కాదని పేర్కొంది.
పాకిస్థాన్‌లో డిగ్రీ పొంది, భారత దేశానికి వలస వచ్చినవారు, వారి పిల్లలకు ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు ఉన్నట్లు తెలిపింది. అయితే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ముందుగా అనుమతి పొందవలసి ఉంటుందని తెలిపింది.
ఇటీవల ఈ వ్యవస్థలు ఇచ్చిన సూచనలో భారతీయ విద్యార్థులు విద్య కోసం చైనాను ఎంపిక చేసుకోవద్దని తెలిపిన సంగతి తెలిసిందే. చైనాలోని విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ సలహా ఇచ్చింది. అయితే పాకిస్థాన్ విషయంలో జారీ చేసిన తాజా నోటిఫికేషన్ వెనుక కారణం వెల్లడికాలేదు.
More Stories
మూడో తరగతి నుంచే ఏఐ!
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి