ఆత్మకూరు ఉప ఎన్నికలో బిజెపి పోటీ 

‘నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుంది. మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. శుక్రవారం నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్న అనంతరం ఈ ప్రకటన చేశారు. 
 
మంత్రిగా ఉంటూ గౌతమ్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక జరుగవలసి ఉంది. ఉపఎన్నికలలో కుటుంభం సభ్యులు పోటీ చేస్తే పోటీ పెట్టరాదని టిడిపి ఉపఎన్నికలకు దూరంగా ఉంటుంది. గత ఏడాది కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికకు ఆ విధంగా దూరంగా ఉంది. 
 
అయితే జాతీయ పార్టీ అయిన తమకు అటువంటి నిబంధన లేదంటూ బిజెపి పోటీ పెట్టింది. ఇప్పుడు ఆత్మకూర్ లో కూడా పోటీకి బిజెపి సిద్దపడుతూ ఉండడంతో పోటీ అనివార్యంగా కనబడుతున్నది. 
 
కాగా,  మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల బ్యాగ్‌ జిల్లా కోర్టులో చోరీకి గురికావడంపై ఎస్పీ చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని వీర్రాజు విమర్శించారు. వెంటనే ఎస్పీ తన మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు ప్రజలకు సేవచేయాలేగాని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కాదని స్పష్టం చేశారు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి రేషన్‌ బియ్యంను ఇతర దేశాలకు ఎవరు తరలిస్తున్నారో అందరికీ తెలుసని రాష్ట్ర ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతికి పోలీసు శాఖ అండగా నిలుస్తోందని సోము ఆరోపించారు.