
ప్రస్తుతం సమాజంలో శాస్త్ర సాంకేతికతలను మానవుడు నడిపిస్తున్నాడా, లేదంటే అవే మనిషిని శాసిస్తున్నాయా అన్న విషయం కీలకంగా మారిందని, ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక ఫలాలు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలే తప్ప, అవి వారిని బానిసలుగా మార్చకూడదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో యలపర్తి నాయుడమ్మ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం ద్వారా శాస్త్ర పరిజ్ఞానం ఎక్కడకు చేర్చాలన్న విషయం అర్థమౌతుందని ఆయన తెలిపారు. విజయవాడ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఇంకమ్ టాక్స్ మాజీ కమిషనర్ డా. చంద్రహాస్ గారి సంపాదకత్వంలో వెలువడి డా. వై నాయుడమ్మ వ్యాసాలు, ప్రసంగాలు పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పష్టమైన లక్ష్యాలు, విలువలతో సాగిన నాయుడమ్మ జీవితం ఎన్నో సవాళ్ళకు, పరిష్కారాలను చూపిందని తెలిపారు. ముఖ్యంగా నాడు తక్కువ స్థాయి వృత్తిగా చూస్తున్న తోలు ఉత్పత్తుల పరిశ్రమను, గౌరవప్రదమైన ఆమోదనీయమైన వృత్తిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిదని తెలిపారు.
తోలు పరిశ్రమల్లో వెలువడే దుర్గంధం, అపరిశుభ్రతల కారణంగా ఆ పరిశ్రమ ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, చెన్నైలోని కేంద్ర తోలు ఉత్పత్తుల పరిశోధన సంస్థ సంచాలకులుగా ఆ పరిశ్రమను అభివృద్ధి బాటలో నడిపించడమే గాక, అందులో పని చేసే కార్మికుల ఆర్థిక పురోభివృద్ధికి కూడా ఆయన కృషి చేశారని గుర్తు చేశారు.
సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించాలన్నది మన నమ్మిన విలువల మీద ఆధారపడి ఉంటుందన్న ఉపరాష్ట్రపతి, ప్రస్తుతం వస్తు, పాశ్చాత్య వ్యామోహంలో సమాజం కూరుకుపోతుండడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితి మారాలని సూచించారు.
ప్రకృతితో మమేకమై సామరస్యంగా జీవించడం ద్వారానే మానవ జన్మ సార్ధకమౌతుందన్న బారతీయ సనాతన ధర్మ సూత్రాన్ని ఉటకించిన ఆయన, ప్రకృతితో మానవుడికి ఉన్న పేగు బంధాన్ని విజ్ఞానం కాపాడాలే తప్ప, తుంచకూడదని తెలిపారు.
శాస్త్ర సాంకేతికతలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాదన్న విషయాన్ని నాయుడమ్మ గారు బలంగా విశ్వసించారన్న ఉపరాష్ట్రపతి, శాస్త్ర పరిజ్ఞానం సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వారి ఆకాంక్షించారని తెలిపారు.
సమాజంలో అన్ని వర్గాలు సాధికారత బాటలో పయనించాలని నాయుడమ్మ ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉండేవని తెలిపారు.
సమాజంలో అన్ని వర్గాలు సాధికారత బాటలో పయనించాలని నాయుడమ్మ ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉండేవని తెలిపారు.
మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉంటే కుటుంబం ఆమెను గౌరవిస్తుందన్న నాయుడమ్మ మాటలను ఉటంకించిన ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ ధన్ పథకం కింద 50 కోట్ల బ్యాంకు ఖాతాల ద్వారా వివిధ వర్గాలకు సాధికారత చేకూర్చిన విషయాన్ని గుర్తు చేశారు.
63 ఏళ్ళ వయసులో 1985లో నాయుడమ్మ విమాన ప్రమాదంలో పరమపదించడం దురదృష్టకరమన్న ఉపరాష్ట్రపతి, వారు జీవించి ఉంటే దేశానికి మరెన్నో సేవలు అందించి ఉండేవారని అభిప్రాయపడ్డారు.
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్, నాయుడమ్మ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సంస్థ చైర్మన్ డా. డి.కె.మోహన్ కూడా పాల్గొన్నారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ