హొళగుందలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్ళ దాడి 

ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగిన భయంకరమైన సంఘటన తదుపరి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుండి ఇలాంటి వార్త వచ్చింది. శనివారం రాత్రి కర్నూలులోని హొళగుందలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభాయాత్రపై రాళ్ల దాడి జరిగింది.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హొళగుండలో శోభా యాత్రను చేపడుతున్నప్పుడు, స్థానిక మసీదులో ఇఫ్తార్ సమావేశానికి హాజరైన ప్రజలకు ఆగ్రహం కలిగించింది. ఊరేగింపు వెళుతుండగా, మసీదు లోపల ఉన్న వ్యక్తులు ‘బిగ్గరగా’ సంగీతం గురించి ఫిర్యాదు చేయడంతో  హింసకు దారి తీసింది.  ఉరేగింపుపై రాళ్లదాడికి పాల్పడ్డారు.

అయితే, కర్నూలు ఎస్పీ సుధీర్‌రెడ్డి మాత్రం ఊరేగింపులో వినిపించిన సంగీతమే హింసకు కారణమని ఆరోపించారు.  హొళగుండలో వీహెచ్‌పీ నిర్వహించిన హనుమాన్‌ జయంతి వేడుకల సందర్భంగా మసీదు దగ్గరికి వెళ్లినప్పుడు, మసీదు ముందు ఆగి ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రతిస్పందనగా, ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు అల్లాహు అక్బర్ అని అరవడం ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.

పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ప్రజలను చెదరగొట్టాలరని చెప్పారు. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలు కాగా, వీడియోలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.
 
కాగా,  హోలగుందలో ఆదివారం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు ఇరు వర్గాలు మోహరించాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందలోనే మకాం వేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

హింసను ఖండిస్తూ, హనుమాన్ జయంతి ఊరేగింపుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  డిమాండ్ చేశారు.హనుమాన్‌ ర్యాలీలో దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలకు రక్షణ కల్పించలేనివారు  సమర్ధవంతమైన పాలకుడు ఎలా అవుతారు? అని బీజేపీ నేత ప్రశ్నించారు. 

 
 ప్రభుత్వ అసమర్థతతోనే హిందువులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది హిందువులు రక్తం చిందించాలన్నారు? అంటూ నిలదీశారు. ప్రతిపక్షాలను హౌస్ అరెస్టుల ద్వారా కట్టడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.