
పాకిస్తాన్‌లోని అణాయుధాలు సురక్షితంగా లేవని అంటూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. గత ఆదివారం అవిశ్వాస తీర్మానంతో పదవి పోగొట్టుకున్న ఆయన దేశంలో అణాయుధాలు సురక్షితంగా లేవని ప్రకటించారు. పైగా, ఇవి దొంగలు, దోపిడీదారుల చేతిలోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గద్దె దిగిన తరువాత.. అక్కడి సైన్యంతో పాటు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తనను గద్దె దించేందుకు సైన్యం ఎంతో కుట్ర పన్నిందని పేర్కొంటూ తన స్థానంలో పదవి చేపట్టిన వారికి అణ్వాయుధాలను సురక్షితంగా ఉంచగల సత్తా ఉందా..? అని ప్రశ్నించారు.
కొత్త ప్రధాని పరిస్థితి కూడా తనలాగే అవుతుందని, ఎవరు వచ్చినా సైన్యం చేతిలో కీలు బొమ్మ కావాల్సిందే అని తేల్చి చెప్పారు. తనను గద్దె దించడంలో విదేశీ కుట్ర దాగి ఉందని మరోసారి విమర్శించారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు అర్థరహితం అని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) డిప్యూటీ జనరల్ (డీజీ) మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్ స్పష్టం చేశారు.
ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఆర్మీ ఖండిస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్‌లోని అణాయుధాలు ఎంతో సురక్షితంగా ఉన్నాయని, ఇవి ఒక్కరికి చెందిన ఆస్తి కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు చెప్పారు.
పాక్ అణాయుధ కమాండ్, కంట్రోల్ వ్యవస్థ ఎంతో సురక్షితంగా ఉందని తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే ఏ దేశం వద్ద లేని అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో అణ్వాయుధాల రక్షణ కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని విమర్శించారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?