అగ్రిహోత్రి తదుపరి చిత్రం ‘ది ఢిల్లీ ఫైల్స్‌’

ఎటువంటి అంచనాలు లేకుండా 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందిందిన సినిమా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ద్వారా దేశ వ్యాప్త సంచలనం కలిగించిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక్  అగ్రిహోత్రి తదుపరి చిత్రంగా  ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. 
 
 ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’  చిత్రంలో బాలీవుడ్‌ దిగ్గజ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పలు ప్రభుత్వాలు వినోదపు పన్నును సైతం మినహాయింపుని ఇచ్చాయి.
 
కేవలం రూ 15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రానికి పది రేట్లకు పైగా ఆదాయం రావడమే కాకుండా దేశ, విదేశాలలో సంచలనాలు సృష్టించింది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన  వివేక్ రంజన్‌ అగ్నిహోత్రి  సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్‌ దర్శకులలో ఒకరు.
ఆయన ఇదివరకు ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇక ఇటీవల వచ్చిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంతో మరో విజయం సాధించారు. దీంతో ఆయన తర్వాతి చిత్రం ఏంటి ? అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తెరదింపుతూ తన కొత్త సినిమా గురించి వెల్లడించారు.  ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ అనే  చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా చిత్రీకరణకు ముందే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.