ఏపీ విపత్తు నిధుల దారి మళ్లింపుపై సుప్రీం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధుల దారిమళ్లింపుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా  మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిధులను పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్ డి ఆర్ ఎఫ్  (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిధులను పిడి (పర్సనల్ డిపాజిట్) ఖాతాలకు మళ్లించడం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో పాటు అప్రాప్రియేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విపత్తు నిధుల దారిమళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కోర్టు ఉదహరించింది.

ఈ నేపథ్యంలో విపత్తు సహాయ నిధులను పీడీ ఖాతాలకు మళ్లించకుండా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పీడీ ఖాతాల్లోకి తరలించిన నిధులను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వినియోగించవద్దని పేర్కొంది. దారి మళ్లింపు ఆరోపణలపై ఏప్రిల్ 28లోగా జవాబివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇదే కేసులో గతంలో గుజరాత్ ప్రభుత్వం తమ ఆదేశాలను అమలు చేయక పోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం సుప్రీం ఆదేశాల మేరకు కరోనా మృతుల కుటుంబాలను గుర్తించేందుకు స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తాజా అఫిడవిట్ దాఖలు చేయడంతో ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.

అయితే దేశంలో కొన్ని చోట్ల వైద్యులు కరోనా మరణాలపై తప్పుడు ధృవీకరణ పత్రాలను జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇదే కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కొవిడ్‌ బాధితులకు నష్టపరిహారంపై ఇప్పటికే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది.