గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ కు రూ 5,911 కోట్లు

గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ కు రూ 5,911 కోట్లు

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జిఎస్‌ఎ) పథకాన్ని 2025-26 వరకూ కొనసాగించడానికి కేంద్ర క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనామిక్స్‌ ఆఫైర్స్‌ (సిసిఇఎ) బుధవారం ఆమోదం తెలిపింది. పంచాయితీరాజ్‌ సంస్థల పరిపాలన సామర్థ్యాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన ఈ పథకం మార్చి 31తో ముగిసింది. 

దీన్ని కొనసాగించడానికి, రూ, 5,911 కోట్లు కేటాయించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అధ్యక్షతన సమావేశమైన సిసిఇఎ ఆమోదించింది. రూ 5,911 కోట్లలో కేంద్ర వాటా రూ. 3,700 కోట్లు, రాష్ట్రాల వాటా రూ. 2,211 కోట్లు. ‘ఆర్‌జిఎస్‌ఎ పథకం కొనసాగింపునకు ఆమోదంతో 2.78 లక్షలకు పైగా గ్రామీణ స్థానిక సంస్థలకు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించడంపై దృష్టి సారించి సమగ్ర స్థానిక పాలన అందిచడం ద్వారా స్థిరమైన అభివృద్థి లక్ష్యాలను సాధించడానికి సహాయ పడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ పథకంతో పంచాయతీలను బలోపేతం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, ఈ పథకం కింద శాశ్వత ఉద్యోగాలు ఏవీ సఅష్టించబడవు అయితే, అవసరాల ఆధారిత ఒప్పందం ద్వారా పథకం అమలును పర్యవేక్షించడానికి, రాష్ట్రాలకు సాంకేతిక సహాయాన్ని అందించడానికి మానవ వనరులను అందించవచ్చు అని తెలిపింది.

2018-2019లో ప్రారంభమైన ఈ పథకాన్ని పొడిగించాలనే నిర్ణయాన్ని సిసిఇఎ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల  ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.