భారత ప్రధానుల మ్యూజియాన్ని ప్రారంభించిన మోదీ 

ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు.
 
ఈ మ్యూజియం గత ప్రధానమంత్రుల కథతో పాటు వారు ఎదుర్కొన్న వివిధ సవాళ్ల ద్వారా దేశాన్ని ఎలా నడిపించారో చెబుతోంది.ఈ మ్యూజియం స్వాతంత్య్ర  పోరాటం నుంచి భారతదేశ చరిత్ర యొక్క సంగ్రహావలోకనాలను అందిస్తుంది. భారత దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు ఈ మ్యూజియాన్ని మోదీ అంకితం చేశారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  భారతావనికి ప్రధానులుగా వ్యవహరించిన వాళ్లలో ఎక్కువమంది గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చారని, ఇది దేశానికే గర్వకారణమైన విషయమని చెప్పారు. 
 
ప్రధాన మంత్రుల జీవిత విశేషాలతో కూడిన ఈ మ్యూజియంను.. 75 ఏండ్ల స్వతంత్ర భారత్ ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియం అంతా కలియతిరిగారు. గత ప్రధానుల గురించిన జీవిత చరిత్రలను వీడియోల ద్వారా వీక్షించారు.
 
‘‘దేశంలోని ప్రధానులంతా.. నాటి సవాళ్లను అధిగమించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారి వ్యక్తిత్వం, సాధించిన విజయాలతో పాటు నాయకత్వానికి వివిధ కోణాలు ఉన్నాయి. ఇవి ప్రజల స్మృతిలో నిలిచిపోవాలి” అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. 
 
ఈ ప్రధానమంత్రి మ్యూజియం భవిష్యత్తును నిర్మించడానికి శక్తి వనరుగా మారుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ మ్యూజియం నుంచి దేశం,  భావి తరాలు స్ఫూర్తి పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  మన ప్రధానుల్లో చాలా మంది సామాన్య కుటుంబాల నుంచి, మారుమూల, గ్రామీణ ప్రాంతాల నుంచి,  నిరుపేద కుటుంబాలు నుంచి,  రైతు కుటుంబాల నుంచి.. వచ్చిన వాళ్లు ఉన్నారని చెబుతూ  ఇది భారతీయులమైన మనకు ఎంతో గర్వకారణం అని కొనియాడారు. 
 
ప్రధాని మోదీ గతంలో వివిధ నగరాల్లో మెట్రో రైడింగ్‌లో టిక్కెట్లు కొనుగోలు చేశారు. మోదీ ఎప్పుడూ డిజిటల్ చెల్లింపులు చేసేవారు. ప్రధానమంత్రులుగా పనిచేసిన నేతల గురించి అవగాహన కల్పించడానికి 14 మంది భారత మాజీ ప్రధానులపై మ్యూజియం అభివృద్ధి చేశారు.
ఈ మ్యూజియంలో దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జీవితం, ఆయన అందించిన సేవలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి నెహ్రూకు లభించిన అనేక బహుమతులను మొదటిసారిగా ప్రదర్శించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు.హోలోగ్రామ్స్, వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్ మల్టీమీడియా, ఇంటరాక్టివ్ స్క్రీన్స్ వంటివి ఏర్పాటు చేశారు.
మ్యూజియం ప్రత్యేకతలు
* ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో 15,600 చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు బ్లాకులు, 43 గ్యాలరీలతో ఈ సంగ్రహాలయాన్ని నిర్మించారు.
*  రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తిగా ఈ మ్యూజియానికి డిజైన్ చేశారు.
* భారత స్వాతంత్ర్య సంగ్రామం, రాజ్యాంగ నిర్మాణం, ప్రధానులు ఎదుర్కొన్న వివిధ సవాళ్లు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని మ్యూజియంలో చూపించనున్నారు.
* వాటితో పాటు దివంగత ప్రధానులు ఉపయోగించిన వస్తువులనూ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు.
* నేత తరానికి ఆనాటి ప్రధానుల సేవలు, నాయకత్వ పటిమ, దార్శనికత, విజయాల గురించి తెలియజేసేందుకు ప్రధానమంత్రి సంగ్రహాలయ ఎంతో దోహదం చేయనుంది.
*  టికెట్‌ ధర 100 రూపాయలు. విదేశీయులకు మాత్రం 750 రూపాయలు.
* ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లకు మాత్రం సగం ధర ఉంటుంది.
* విద్యాసంస్థల తరపున వెళ్తే మాత్రం.. 25 శాతం డిస్కౌంట్‌ వర్తిస్తుంది.