బండి సంజయ్ మలివిడత ప్రజాసంగ్రామ యాత్ర నేటి నుండే!

నేడు అలంపూర్‌ నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభంకానుంది. రెండో విడత పాదయాత్రను  బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ  రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ ప్రారంభించనున్నారు. 

తొలుత జోగులంబ ఆలయంలో బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు చేస్తారు. రెండో విడత పాదయాత్ర మే 14న మహేశ్వరంలో ముగియనుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం ఆలంపూర్‌లో సాయంత్రం జరిగే బహిరంగ సభతో పాదయాత్ర ప్రారంభం కానున్నది.

పాదయాత్రకు బయలుదేరే ముందు ఖైరతాబాద్ చౌరస్తాలోలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని బండి సంజయ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెలుగులోకి తెచ్చేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. విడతలవారీగా, రాష్ట్రం లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా, తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. 

మొదటి విడత పాద యాత్ర 2021 ఆగస్టు 24న హైదరాబాద్​లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమై అక్టోబర్​ 2 గాంధీ జయంతి రోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది. ఎంతో మంది ప్రజలు వారి కష్టాలు, సమస్యలు పాదయాత్రలో చెప్పుకున్నారు. మొదటి విడత పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వచ్చింది. 

అదే స్ఫూర్తితో ఏప్రిల్ 14 బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి రోజు జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్నారు. వందలాది మంది యువకుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల కల్వకుంట్ల కుటుంబ గడీల పాలనలో బందీ అయింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో, ప్రజా స్వామిక తెలంగాణ నిర్మాణంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

ప్రజలకు ఇచ్చినా హామీలపైననే ఈ యాత్రలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రజల ముందు కేసీఆర్ ప్రభుత్వం దివాళాకోరుతనాన్ని బయటపెట్టడంతో పాటు, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో అన్ని వర్గాల ప్రజలకోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సహితం ప్రజలకు వివరించనున్నారు.

ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి, ఇంటికో ఉద్యోగం, పోడు భూములకు పట్టాలు, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత వంటి హామీలతో ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీ వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రంలో 10 శాతం ఉన్న గిరిజనులకు ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవకాశం ఉన్నా.. అలాంటి చర్యలు ఏమీ చేపట్టకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ప్రశ్నిపనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని, అందుకు 73 ఎకరాల భూమి రూ 53 కోట్లు  కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు బుట్ట దాఖలయ్యాయి. 

డబుల్‌ బెడ్‌రూమ్‌ వంటి పేదల గృహనిర్మాణాలకు భూమి కొరత ఉందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా మారి ప్రభుత్వ భూములను తెగనమ్ముతోంది. పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములపై కూడా కన్నేయడం దళిత, గిరిజన, బలహీన వర్గాలపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. 

హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో తీసుకొచ్చిన దళితబంధు పధకం అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు రైతు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి అమలుకాని అనేక ప్రభుత్వ హామీల విషయమై ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు సమాయత్తం అవుతున్నారు.