మంత్రులు అతిధి గృహాల్లోనే బస చేయాలి… యోగి ఆదేశం 

మంత్రులు అతిధి గృహాల్లోనే బస చేయాలి… యోగి ఆదేశం 
అధికారిక పర్యటనల సమయంలో హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలని, బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దని రాష్ట్ర మంత్రులను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ ఆదేశాలను ఇచ్చారని ఓ అధికారి బుధవారం తెలిపారు. 
హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలనే నిబంధన ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తుందని యోగి చెప్పారు. అధికారులు సరైన సమయానికి విధులకు హాజరుకావాలని, భోజన సమయం 30 నిమిషాలకు మించకూడదని ఆదేశించారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో భోజన విరామ సమయం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.00 గంటల వరకు ఉంటుంది.
విధులకు ఆలస్యంగా హాజరయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రామాణిక, నాణ్యమైన సేవలను సకాలంలో అందజేస్తామని తెలిపే సిటిజన్స్ చార్టర్‌ను అమలు చేస్తామని చెప్పారు. కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రతి ఫైలును సకాలంలో పరిష్కరించాలని, ఏ ఫైలునూ మూడు రోజులకు మించి పెండింగ్‌లో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జాప్యం జరిగితే అందుకు బాధ్యులను నిర్ణయించి, చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
అక్రెడిటేషన్ లేకుండా కళాశాలలను నిర్వహించడమంటే యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవడమేనని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి కళాశాలలపై ఫిర్యాదులు వచ్చినా, సమాచారం తెలిసినా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 హింసాత్మక ఘటనలకు తావులేదు

ఇలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు తావులేదని యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు.ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు రమజాన్‌ ఆచారాలు పాటిస్తున్న సమయంలో రామనవమి నాడు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
‘‘25 కోట్ల మంది జనాభా ఉన్న యూపీలో 800 రామనవమి ర్యాలీలు జరిగాయి. అదే సమయంలో రంజాన్ మాసం కావడంతో రోజా, ఇఫ్తార్‌లు కూడా జరిగాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం కూడా జరగలేదు. హింస, అల్లర్లు ప్రశ్నే కాదు. ఇది ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించే వైఖరిని సూచిస్తుంది’’ అని యోగి వివరించారు.
 
గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ మేర సీఎం యోగి వీడియోను ట్వీట్ చేశారు. పలు రాష్ట్రాల్లో ఆదివారం జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే యూపీలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం జరగకుండా.. ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి.