
పాకిస్థాన్ ప్రతిపక్షాలు తమ ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్థిగా పీఎంఎల్-ఎన్ నేత షెహబాజ్ షరీఫ్‌ను ఆదివారం నియమించాయి. ఈ పదవికి ఎన్నిక (స్థానిక కాలమానం ప్రకారం) సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నేషనల్ అసెంబ్లీలో జరుగుతుంది.
ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఓడిపోవడంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే.
మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్.
నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. షెహబాజ్ షరీఫ్ కోసం పీఎంఎల్-ఎన్ పార్టీ చాలా నామినేషన్ పత్రాలను నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆయనకు మద్దతుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా నామినేషన్లను దాఖలు చేయడం కోసం అదనంగా నామినేషన్ పత్రాలను తీసుకున్నట్లు సమాచారం. షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవజ్ఞుడు.
పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. ప్రస్తుతం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు తాత్కాలిక స్పీకర్ అయాజ్ సాదిక్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో నూతన ప్రధాన మంత్రిని ఎన్నుకునేందుకు సోమవారం నేషనల్ అసెంబ్లీ సమావేశమవుతుందని తెలిపారు.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, పాత పాకిస్థాన్‌కు స్వాగతం అని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని చెప్పారు. తమ కలలను త్యజించవద్దని యువతను కోరారు. ఏదీ అసాధ్యం కాదని తెలిపారు.
పాకిస్థాన్ మీడియా తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, కశ్మీరు సమస్య పరిష్కారం కానిదే భారత్-పాక్ మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరబోవని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్‌పై కేసు విచారణ చట్ట ప్రకారం జరుగుతుందని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన ఆదివారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి