
పౌరాణిక కథల్లో కూడా అత్యాచారాల ఉదాహరణలు ఉన్నాయని అంటూ అత్యాచారానికి సంబంధించిన చారిత్రక దృక్కోణాలను క్లాసులో ప్రస్తావించినందుకు ఓ ప్రొఫెసర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బిజెపి కార్యకర్త నిషిత్‌శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు) లోని జెఎన్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జితేంద్రకుమార్‌పై ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
భారతీయ పురాణాల్లో దేవుళ్లు అత్యాచారానికి పాల్పడ్డరని క్లాసులో చెప్పడం ద్వారా ప్రొఫెసర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని నిషిత్‌శర్మ ఆరోపించారు. ఏప్రిల్ 5 మంగళవారం ఆయన ఎంబిబిఎస్ మూడో ఏడాది విద్యార్థులకు అత్యాచారాలపై పాఠ్యాంశాన్ని బోధిస్తూ ప్రొఫెసర్ పవర్‌ప్రాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అత్యాచారం పురాతన కాలం నుంచి ఉనికిలో ఉందని వివరిస్తూ రోమన్, గ్రీక్, భారత్‌లతో సహా ప్రపంచంలోని వివిధ మూలాల్లోని పురాణాల్లో గల అత్యాచార సంస్కృతికి సంబంధించిన పలు పౌరాణిక ఉదాహరణలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే, ఒక మతానికి చెందిన దేవుళ్లను కించపరిచేలా ప్రొఫెసర్ వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో మతవిశ్వాసాలను అవమానించడం (295-ఎ), వివిధ వర్గాల మధ్య విబేధాలను రెచ్చగొట్టడం (153- ఎ) వంటి సెక్షన్‌ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. దీంతో సదరు యూనివర్శిటీ ప్రొఫెసర్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు అతన్ని సస్పెండ్ చేసింది.
మంగళవారం ఢిల్లీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు)లో జరిగిన ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎఎంయు ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, ఈ ఘటనపై ప్రొఫెసర్ జితేందర్ కుమార్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌కి ఓ లేఖ రాస్తూ తాను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. అనాది కాలం నుండి అత్యాచారాలు జరుగుతున్నాయని విద్యార్థులకు వివరించేందుకే పురాణాల నుండి కొన్ని ఉదాహరణలు తీసుకున్నానని పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని ఆయన వివరణ ఇచ్చారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్