భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ మొదటి కేస్

భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ తాజాగా కలకలం రేపుతోంది. ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ తొలి కేసు నమోదైంది. తాజాగా 230 శాంపిల్స్ పరీక్షించగా 228 మందికి ఒమిక్రాన్, ఒకరికి ఎక్స్‌ఈ, ఒకరికి కప్పా వేరియంట్ సోకినట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు.  
 
దేశంలో కరోనా ఉపద్రవం తగ్గినదని,  కరోనా ఆంక్షలను సడలించారు. మాస్కులు ధరించడం కూడా తగ్గించారు. అటువంటి సమయంలో ఈ వార్త పిడుగుపాటు వలే ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒకరికి ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసు నమోదైనట్లు బృహాన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. 
 
దీంతోపాటు మరొకరికి కాపా వేరియంట్‌ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే కొత్త రకం వేరియంట్‌ నమోదైన వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని, ఎవరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌, ఐసీయూ అవసరం లేదని బీఎంసీ అధికారులు తెలిపారు.
 
కాగా, ఆ మహిళకు కరోనా కొత్త వేరియంటు ఎక్స్‌ఇ సోకినట్లు పూర్తిస్థాయిలో ఇంకా నిర్థారణ కాలేదని,  దీనిని ఇంకా తాము పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు జరిపిన శాస్త్రీయ పరీక్షలలో ఇది ఎక్స్‌ఇ వేరియంటు కరోనా అని చెప్పడానికి వీల్లేదని దేశంలో కరోనా జీనమ్ పరీక్షల సమాఖ్య అయిన ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. 
 
దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బ్రిటన్‌లో జనవరి 19న తొలి ఎక్స్‌ఈ కేసు నమోదైంది.  దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,086 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో క్రీయాశీలక కేసుల సంఖ్య 11 వేల 871. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకూ  కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 24 లక్షలు దాటింది. మరోవైపు జాతీయ టీకాకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 185 కోట్ల 4 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేశారు. అటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 185 కోట్ల 79 లక్షల వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందించామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
15 కోట్ల 70 లక్షలకు పైగా వినియోగించని వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.