
దేశంలో పన్ను వసూళ్లు నూతన రికార్డ్‌ను సృష్టించాయి. ప్రస్తుత ఏడాది మార్చిలో స్థూలంగా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో ఏకంగా రూ.1.42 లక్షల కోట్లు వసూళ్లయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇంతక్రితం జనవరిలో వసూలు చేసిన రూ. 1,40,986 కోట్ల రికార్డ్‌ను అధిగమించినట్లయ్యిందని తెలిపింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన జిఎస్‌టి ఆదాయాల కంటే 15 శాతం ఎక్కువని ఆర్థిక శాఖ పేర్కొంది. 2020 మార్చి వసూళ్లతో పోల్చితే ఏకంగా 46 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
గడిచిన మాసం స్థూల జిఎస్‌టి వసూళ్లలో సిజిఎస్‌టి రూ.25,830 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ. 32,378 కోట్లు, ఐజిఎస్‌టి రూ. 74,470 కోట్లు, సెస్ రూ.9,417 కోట్లు చొప్పున వసూళ్లయ్యాయి. వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 25 శాతం పెరిగాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో నెలకు సగటున రూ.1.38 లక్షల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి. ఇంతక్రితం ఒక్కటి, రెండు, మూడో త్రైమాసికాల్లో నెలకు సగటున వరుసగా రూ.1.1 లక్షల కోట్లు, రూ.1.5 లక్షల కోట్లు, 1.3 లక్షల కోట్లు చొప్పున నమోదయ్యాయి.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు