
ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు నాలుగు రోజుల ముందుగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారు. ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 3న పార్లమెంట్‌లో ఓటింగ్ జరగనుంది.
ఈ నేపథ్యంలోనే కీలక భాగస్వామ్య పక్షమైన ఎమ్‌క్యూఎమ్ బుధవారం సంకీర్ణం నుండి నిష్క్రమించింది. ప్రతిపక్షానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాక్ జాతీయ అసెంబ్లీలో విపక్షాల బలం 176కు పెరిగింది. అధికార కూటమి బలం 164కు పడిపోయింది. దీంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మెజార్టీ కోల్పోయారు.
ఈ పరిస్థితుల్లో ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాజీనామా వార్తలను సమాచార శాఖ మంత్రి తోసిపుచ్చారు. చివరి బంతివరకు ఇమ్రాన్ పోరాడతారని స్పష్టం చేశారు. అయితే అవిశ్వాస తీర్మానం విదేశీ శక్తులు సృష్టించిన సంక్షోభమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరోపించారు. దీనిపై మీడియాకు ఆధారాలు విడుదల చేస్తానని తెలిపారు. జాతి నుద్దేశించి బుధవారం సాయంత్రం ప్రసంగించ వలసి ఉండగా, సైన్యాధిపతి బజ్వా కలిసి వారించడంతో ఆగిపోయారు.
ఇదిలా ఉండగా, పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సభ్యులకుగాను పీటీఐకి 155 మంది ఉన్నారు. మరో ఆరు పార్టీల నుంచి 23 మంది మద్దతుతో ఇమ్రాన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అవిశ్వాస గండం గట్టెక్కాలంటే 172 మంది మద్దతు కావాలి.
కానీ 24 మంది సొంత ఎంపీల తిరుగుబాటుతో పాటు, ఐదుగురు సభ్యులున్న ఎమ్‌క్యూఎమ్ కూడా సంకీర్ణానికి గుడ్‌బై చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయడం తప్ప ఇమ్రాన్ ఖాన్ కు మార్గం కనిపించడం లేదు. అయితే, అవిశ్వాసం తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారని కధనాలు వెలువడుతున్నాయి.
జాతీయ అసెంబ్లీ గడువు ఎటూ ఏడాదిలో ముగియనున్నందున దాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సన్నిహితులు సూచిస్తున్నారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ జరిపిన ర్యాలీ బల ప్రదర్శనేనన్న అభిప్రాయాలున్నాయి.
లండన్‌లో కూర్చున్న వ్యక్తి పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చడానికి విదేశీ డబ్బును వాడుతున్నారంటూ విపక్ష నేత నవాజ్ షరీఫ్‌పై ర్యాలీలో ఇమ్రాన్ నిప్పులు చెరిగారు. ఇదంతా ఎన్నికల ప్రచారం మాదిరిగానే ఉందని, బహుశా ముందస్తుకు ఇమ్రాన్ సై అంటారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర?
మరోవంక, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ సంచలనపీటీఐ సీనియర్ నేత ఫైజల్ వవ్దా చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాక్ రాజకీయాలను ప్రభావితం చేయాలని కొన్ని బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఈ క్రమంలోనే రాజకీయ సంక్షోభానికి తెర లేపాయని ఆయన ఆరోపించారు.
అయితే ఇమ్రాన్ మొండిగా ముందుకెళ్తున్నాడని, అందుకే చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారని అంటూ ఫైజల్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారం ఇంటెలిజెన్సీ వర్గాలు తమ ప్రభుత్వానికి అందించాయని పీటీఐ నేతలు పలువురు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్‌తో పాటు కార్లను సైతం ఉపయోగించాలని నిఘా వర్గాలు ఇమ్రాన్ ఖాన్‌కు సూచించాయట. అయితే తాను చావుకు భయపడనని ఇమ్రాన్ ఖాన్.. తోటి నాయకులతో చెప్పినట్లు ఏఆర్‌వై న్యూస్ కథనం ప్రచురించింది. అయితే ప్రతిపక్షాలు ఇదంతా ఉత్త డ్రామాగా కొట్టిపారేస్తున్నాయి.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము