రాష్ట్రాలకూ మైనార్టీలను గుర్తించే అధికారం

మైనార్టీలను గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వానిని మాత్రమేఉందన్న వాదనను కేంద్ర  ప్రభుత్వం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మైనార్టీలను గుర్తించి, వారి కోసం మార్గదర్శకాలను తయారు చేసే అధికారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. 
 
లడఖ్‌, మిజోరం, లక్షద్వీప్‌, కాశ్మీర్‌, నాగాలాండ్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ముణిపూర్‌ రాష్ట్రాల్లో హిందూమతం, జుడాయిజం, బహాయిజంలను మైనార్టీలుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిటీషన్‌ వేశారు. 
 
ఈ మతాల వారు ఆ తొమ్మిది రాష్ట్రాల్లో ప్రత్యేక పాఠశాలలను స్థాపించుకుని, నిర్వహించుకోవడానికి అనుమతించడాన్ని వ్యతిరేకించారు. దీనిపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 
 
మైనార్టీలను గుర్తిస్తూ వారి రక్షణ, ప్రయోజనాల కోసం చట్టం చేయడానికి పార్లమెంట్‌కు, రాష్ట్ర శాసనసభలకు ఒకే విధమైన అధికారాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మతస్థులు మరొక రాష్ట్రంలో మైనారిటీలుగా ఉండవచ్చునని తెలిపింది.