ముస్లింలు బీజేపీని, యోగిని, మోదీని ప్రేమిస్తారు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నెలల తరబడి చురుగ్గా పార్టీ బిజెపి విజయం కోసం  పనిచేసిన తర్వాత విరామం నుండి గత వారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపడుతున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరు కావడం కోసం  ముస్సోరీలో విహారయాత్ర నుండి తిరిగి వచ్చిన  33 ఏళ్ల డానిష్ ఆజాద్ అన్సారీకి తాను కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు ఏమాత్రం ఊహించలేదు. 
 
ఆయన ఎమ్యెల్యేగా పోటీ చేసి గెలుపొందలేదు. కనీసం ఎమ్యెల్సీ కూడా కాదు.  అయినా ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఏకైక ముస్లిం ప్రతినిధిగా, సహాయ మంత్రిగా చేరడం అతనికే విస్మయం కలిగించింది.  గత ప్రభుత్వంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న మొహ్సిన్ రజా స్థానంలో ఆయనను తీసుకున్నారు. 

డానిష్ యూపీ బీజేపీ మైనారిటీ విభాగానికి ప్రధాన కార్యదర్శి. మునుపటి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో 2018 నుండి ఉర్దూ భాషా కమిటీ సభ్యునిగా ఉన్నాడు. అంతకు మించి ప్రభుత్వంలో ఎప్పుడు ఎటువంటి పదవి చేపట్టలేదు. పలు ఫిర్యాదుల కారణంగా పార్టీ ఈసారి రజాను మంత్రివర్గం నుండి తొలగించిందని వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు మంత్రి కావడంతో డేనిష్ ను శాసన మండలికి బీజేపీ నామినేట్ చేయవలసి ఉంది. 

అన్సారీ లక్నో విశ్వవిద్యాలయం నుండి క్వాలిటీ మేనేజ్‌మెంట్ , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. అక్కడ, 2011లో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సభ్యునిగా క్రియాశీలకంగా పనిచేశారు. 2018 వరకు ఎబివిపి  లక్నో మహానగర్ యూనిట్‌లో వివిధ సంస్థాగత పదవులను నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీలో చేరాడు. 
ఆదిత్యనాథ్ మంత్రివర్గంలోకి తన చేరిక గురించి అడిగినప్పుడు, అన్సారీ ది సండే ఎక్స్‌ప్రెస్‌తో ఇలా అన్నారు: “యోగీజీ , మోదీజీ నాకు మంత్రి పదవిని ఇచ్చారు. యువత, సమాజంలోని అన్ని ఇతర వర్గాల సాధికారత, సంక్షేమం కోసం నేను పని చేయాలి” అని చెప్పారు. 
 
అన్సారీ ముస్లిం సమాజానికి చెందిన సున్నీ వర్గానికి చెందినవాడు. ఈ వర్గం సాధారణంగా రాజకీయంగా బిజెపికి వ్యతిరేకమని భావిస్తుంటారు. గతంలో మంత్రిగా పనిచేసిన రజా ముస్లింల షియా వర్గానికి చెందినవాడు. ఈ వర్గం  బిజెపికి సాపేక్షంగా ఎక్కువ అనుకూలమని నమ్ముతారు. ఉదాహరణకు లక్నోలో బీజేపీకి షియా ముస్లిం ఓట్లు పడతాయని చెబుతారు.  

“అన్సారీ ఓబీసీ ముస్లిం. ఆయనను (కొత్త) మంత్రివర్గంలోకి చేర్చడం ద్వారా, పార్టీ ఓబిసి ముస్లింల ఓటర్లను చేరుకోవడానికి ప్రయత్నించింది,” అని ఒక బిజెపి నాయకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. తన వంతుగా, అన్సారీ, “ఆ అభిప్రాయం (సున్నీ ముస్లింల) మారిపోయింది. ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల కోసం యోగి ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసింది. రేషన్, ఇళ్లు, ఆయుష్మాన్ కార్డు పథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయి. ముస్లింలు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు” అని స్పష్టం చేశారు. 
 
అందుకే వారు బీజేపీని, యోగిని, మోదీని ప్రేమిస్తారని చెబుతూ ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం జనాభాలో దాదాపు 10 శాతం మంది బీజేపీకి ఓటు వేశారని అన్సారీ పేర్కొన్నారు. తూర్పు యుపి, సెంట్రల్ యుపి, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో ముస్లింల మధ్య ఆయన ప్రచారం చేశారు.

బిజెపి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజాక్షేత్రంలో సవాళ్లను ఎదుర్కొన్నారా? అని అడిగిన ప్రశ్నకు అన్సారీ, “సామాన్య ముస్లింలు నన్ను వ్యతిరేకించరు. మరేదైనా పార్టీతో సంబంధం ఉన్నవారు, ఎస్పీ, బీఎస్పీల ఆలోచనా విధానం ఉన్నవారు మాత్రమే నన్ను వ్యతిరేకిస్తారు. సామాన్య ముస్లింలు బీజేపీ పనిని ఇష్టపడుతున్నారు” అని చెప్పారు.

అన్సారీ బల్లియాకు చెందినవాడు, అక్కడ అతని తండ్రి నేత, చీరల దుకాణం నడుపుతున్నారు.  అతని తల్లి పాఠశాల ప్రిన్సిపాల్. స్వతంత్ర బాధ్యతతో మరో సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దయాశంకర్ సింగ్ లక్నో విశ్వవిద్యాలయంలో అన్సారీ సీనియర్. ఆయున పోటీచేసిన  బల్లియా నగర్ స్థానంలో ప్రచారం చేశారు.

అన్సారీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, వేదికపై ప్రధాని మోదీ, సీఎం ఆదిత్యనాథ్ ఉన్నారు. ఆయన  వారిని కలవడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు, వేదికపై కుర్చీలు వేయడం, టెంట్లు వేయడం వంటి ఏర్పాట్లకు పార్టీ కార్యకర్తగా  వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుండడంతో ఆ నాయకులు ఇద్దరినీ ఇంతకు ముందు చాలాసార్లు కలిసాడు కూడా.