స్టాలిన్ దుబాయ్ పర్యటనపై బిజెపి విసుర్లు

‘వరల్డ్‌ ఎక్స్‌పో’లో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ పర్యటన కుటుంభం పర్యటన లేదా ప్రభుత్వ పర్యటన అంటూ తమిళనాడు బిజెపి విస్మయం వ్యక్తం చేసింది. ఆయన పెట్టుబడులకోసం వెళ్లిన్నట్లు చెబుతున్నప్పటికీ ఆయన వెంట అధికార్లకన్నా కుటుంభం సభ్యులే ఎక్కువగా ఉన్నరన్తి ఎద్దేవా చేసింది. 
 
గతేడాది అక్టోబర్‌లోనే దుబాయ్‌లో వరల్డ్‌ ఎక్సోపో ప్రారంభమైనా, వారంలో ఆ ప్రదర్శన ముగియనున్న సమయంలో ప్రభుత్వం తరఫున స్టాల్‌ ఇప్పుడు ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు. ఇందులో వున్న మతలబేంటో చెప్పాలని ప్రశ్నించారు. వారంలో ముగియనున్న ఎక్స్‌పోలో ప్రభుత్వ స్టాల్‌  ఏర్పాటు చేయడం వల్ల పారిశ్రామిక పెట్టుబడులను సమీకరించలేరని మండిపడ్డారు.
 నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు  అన్నామలై మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలకులు కల్లబొల్లిమాటలతో ప్రజలను మోసపుచ్చుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లేవని ఆరోపించారు.
 నిరుపేద యువతులకు ఇచ్చే తాళికి బంగారం పథకాన్ని రద్దు చేశారని, ప్రభుత్వ రుణభారం విపరీతంగా పెరగిందని, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంగా పేరు తెచ్చుకుందని విమర్శించారు.
రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ.16వేల కోట్ల జీఎస్టీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జీఎస్టీ సమావేశంలో పాల్గొనలేదని ఆర్థిక మంత్రి చెబుతున్నారని, అయితే ఇటీవల శాసనసభలో కేంద్రం రూ.6500 కోట్ల వరకూ జీఎస్టీ బకాయిలు చెల్లించనట్లు అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు.
ఈ ధర్నాలో పార్టీ సీనియర్‌ నేతలు హెచ్‌ రాజా, కరాటే త్యాగరాజన్‌, దురైసామి, శాసనసభ్యులు ఎంఆర్‌గాంధీ, కరునాగరాజన్‌,  తదితరులు పాల్గొన్నారు.