తెలంగాణాలో విద్యుత్ చార్జీలపై రూ.5596 కోట్ల భారం

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా విద్యుత్తు చార్జీలను పెంచుతూ కేసీఆర్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. డిస్కమ్‌లు ఏ మేరకు చార్జీలు పెంచాలని ప్రతిపాదనలు సమర్పించాయో ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) అంగీకారం తెలిపింది. 
 
2022-23 సంవత్సరంలో భారీగా చార్జీలు వడ్డిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, ఎల్‌టీ (లోటెన్షన్‌)లో గృహేతర వినియోగదారులతో పాటు హెచ్‌టీ (హైటెన్షన్‌) వినియోగదారులకు యూనిట్‌కు రూ.1 పెంచారు. ఈ మేరకు చార్జీలు పెంచడం వల్ల ప్రజలపై రూ.5596 కోట్ల భారం పడనుంది. 
 
చార్జీల పెంపు ద్వారా రూ.6831 కోట్లు సమకూర్చుకోవాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. రూ.5596 కోట్లకు కుదిస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. తగ్గిన భారమంతా ‘పెద్దల’ (పారిశ్రామిక వర్గాలు, క్యాప్టివ్‌ ప్లాంట్లున్న వారి)కే కావడం గమనార్హం! పేదలకు ఏ మాత్రం ఉపశమనం కల్పించకుండా చార్జీలు పెంచేశారు. 
 
బహిరంగ విపణిలో కరెంట్‌ కొనుగోలు చేసే వారి నుంచి ఫెసిలిటేషన్‌ చార్జీలు వసూలు చేయాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనలను మాత్రం ఈఆర్‌సీ పకనపెట్టింది. అంతేగాక గ్రిడ్‌ సపోర్ట్‌ చార్జీలు వద్దన్న పారిశ్రామికవేత్తల విజ్ఞప్తిని గ్రిడ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీకి సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
కొత్త చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుండగా.. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.53,053.55 కోట్ల ఆదాయ అవసరాలు ఉన్నాయని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. దాన్ని రూ.48,708.27 కోట్లకు కుదిస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. 
 
ఇక విద్యుత్తు కొనుగోలుకు రెండు డిస్కమ్‌ల (దక్షిణ-ఎస్పీడీసీఎల్‌, ఉత్తర-ఎన్పీడీసీఎల్‌)కు రూ.39,415 కోట్లు అవుతాయని అంచనా వేయగా.. దీన్ని రూ.35,134 కోట్లకు కుదించారు. ఒక యూనిట్‌ విద్యుత్తును వినియోగదారుడికి సరఫరా చేయడానికి అయ్యే వ్యయం ఎన్పీడీసీఎల్‌లో రూ.7.57, అదే ఎస్పీడీసీఎల్‌లో రూ.6.80 అవుతుందని ప్రతిపాదించారు. 
 
అయితే, దాన్ని సగటున రెండు డిస్కమ్‌లకు కలుపుకొని రూ.7.03గా నిర్ధారిస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. 2018-19లో యూనిట్‌ సరఫరా వ్యయం రూ.6.04 ఉండగా దీన్ని ఏకంగా 16 శాతం పెంచి  రూ.7.03కు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 26 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఇప్పటిదాకా రూ.4687 కోట్లు సబ్సిడీ ఇస్తుండగా.. దీన్ని రూ.6754 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఈఆర్‌సీ గుర్తు చేసింది.
 
 ఇక 200 యూనిట్లలోపు వినియోగిస్తున్న వారికి రూ.1466 కోట్ల సబ్సిడీ కలుపుకొని.. టారిఫ్‌ సబ్సిడీ రూపంలో రూ.8221.17 కోట్లను 2022-23లో ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ కేంద్రాలకు విద్యుత్తు చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా ఈఆర్‌సీ తిరస్కరించింది. కుటీర పరిశ్రమలకు, వ్యవసాయ పంపుసెట్లకు చార్జీలు పెంచలేదు. 
 
రైస్‌మిల్లుల కాంటాక్ట్‌ లోడ్‌ను 100 హెచ్‌పీ నుంచి 125 హెచ్‌పీకి పెంచారు. ఇక మేకలు, గొర్రెలు, పాడిపరిశ్రమ కేటగిరీ లోడ్‌ గరిష్ఠ పరిమితిని 10 నుంచి 15 హెచ్‌పీకి పెంచారు. ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులపై ఫెసిలిటేషన్‌ చార్జీల ప్రతిపాదనను ఈఆర్‌సీ తిరస్కరించింది. 
 
దీంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు గ్రీన్‌ టారిఫ్‌ కోరితే డిస్కమ్‌లు అందుకు యూనిట్‌కు రూ.2 ప్రతిపాదించాయి. దాన్ని 0.66 పైసలకు తగ్గించారు. క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్లు కలిగిన వారిపై గ్రిడ్‌ సపోర్ట్‌ చార్జీలు విధించే ప్రతిపాదనలను ఈఆర్‌సీ వాయిదా వేసి.. గ్రిడ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీకి ఈ అంశాన్ని బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
 
వ్యవసాయ వినియోగం కచ్చితంగా లెక్కించడానికి రెండేళ్లలోపు వ్యవసాయ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌)కు స్మార్ట్‌/ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాలని టీఎ్‌సఈఆర్‌సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు స్పష్టం చేశారు.  వ్యవసాయ డీటీఆర్‌లకు మీటర్లు పెట్టే ప్రణాళిక అమలుపై మూణ్నెల్లకోసారి వాస్తవ స్థితిగతుల నివేదికలను అందించాలని డిస్కమ్‌లను ఆదేశించారు.
 
కాగా, రాష్ట్రంలో డిస్కమ్‌లకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు రూ.17202.15 కోట్లుగా ఉన్నాయి. ఇవన్నీ గత ఫిబ్రవరి 28 నాటికి ఉన్నవే. వీటిలో ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు రూ.12598.73 కోట్లు కాగా.. ఇతర వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4603.41 కోట్లు అని ఈఆర్‌సీ ప్రకటించింది. విద్యుత్తు చార్జీల పెంపుతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌ల రెవెన్యూ లోటు శూన్యస్థాయికి చేరినట్లు తెలిపింది.