13 భాషల్లో కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో అడ్మిషన్ టెస్ట్ 

ఇకపై దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో (సెంట్రల్ యూనివర్సిటీలు) అడ్మిషన్ల కోసం ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో దాదాపు 50 వరకు కేంద్రీయ విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ఒక్కో వర్సిటీ ఒక్కో విధానాన్ని అవలంభిస్తోంది. 

కొన్ని యూనివర్సిటీలు కామన్ ఎంట్రెన్స్ నిర్వహించి అడ్మిషన్లు ఇస్తుండగా.. మరికొన్ని 12వ తరగతి రిజల్ట్స్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తొలగించేలా దేశమంతా ఒకటే విధానం తీసుకురావాలని యూజీసీ నిర్ణయించింది. 

ఇక నుంచి ఈ వర్సిటీల్లో ప్రవేశాలకు తప్పనిసరిగా సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) రాయాల్సిందేనని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పరీక్ష 13 భాషల్లో నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కామన్ టెస్ట్ విధానం అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీ రిఫామ్ అని యూజీసీ చైర్మన్ తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీల్లో చదవాలనుకునే వాళ్లు వేర్వేరు పరీక్షలు రాయాల్సి వస్తోందని, ఇకపై ఇబ్బంది ఉండబోదని చెప్పారు. ప్రస్తుతం యూనివర్సిటీలు అనుసరిస్తున్న రిజర్వేషన్, అడ్మిషన్ పాలసీల్లో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.

అయితే ప్రవేశాలకు కల్పించేందుకు మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్ష స్కోర్ ఆధారంగా విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు కల్పించడం యూనివర్సిటీల సామాజిక బాధ్యత అని జగదీశ్ కుమార్ చెప్పారు. ఈ మేరకు దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు పబ్లిక్ నోటీసులు పంపామని తెలిపారు.

సీయూఈటీ అనేది మూడున్నర గంటల పాటు జరిగే కంప్యూటరైజ్జ్‌ మల్టిఫుల్‌ చాయిస్‌ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించబడుతుంది. మొదటిది అభ్యర్థులు ఎంచుకున్న భాషలో వారి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. 

అభ్యర్థులు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలీ, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్ వంటి అదనపు భాషలలో మరొక ఐచ్చిక పరీక్ష రాయాల్సి ఉంటుంది. 

రెండో విభాగంలో అభ్యర్థులు ప్రామాణిక సబ్జెక్ట్‌లు ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న 27 సబ్జెక్టుల్లో కనీసం ఒకటి, గరిష్టంగా ఆరు ఎంచుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లోని రసాయన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం.. కామర్స్‌ నుంచి అకౌంట్స్‌ లేదా బిజినెస్..  హ్యుమానిటీస్ నుంచి సైకాలజీ లేదా సోషియాలజీ వంటి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. 

మూడవ విభాగంలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సహా సాధారణ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని కోర్సులకు నిర్దిష్ట పరీక్షలు అవసరం కావచ్చు. కొన్నింటికి భాష, సాధారణ సామర్థ్య పరీక్షలు రాస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న అడ్మిషన్, రిజర్వేషన్ విధానాన్ని సీయూఈటీ ప్రభావితం చేయదు.

విశ్వవిద్యాలయాలు సీయూఈటీ స్కోర్ ఆధారంగా పాత పద్ధతిలోనే జనరల్, రిజర్వేషన్‌ సీట్లు భర్తీ చేస్తాయి. మైనారిటీ విద్యార్థుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేసే జేఎంఐ, ఏఎంయూ కాలేజీల రిజర్వేషన్ విధానాలను సీయూఈటీ ప్రభావితం చేయదు. అయితే, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశ అర్హత సాధించాలంటే విద్యార్థులందరూ తప్పనిసరిగా సీయూఈటీ రాయాల్సి ఉంటుంది.

విదేశీ విద్యార్థులకు సీయూఈటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాలు వారికి ప్రవేశం కల్పిస్తాయి. సంగీతం, ఫైన్ ఆర్ట్స్, థియేటర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ప్రాక్టికల్, ఇంటర్వ్యూలు నిర్వహించడానికి విశ్వవిద్యాలయాలకు యూజీసీ అనుమతిస్తుంది. నీట్‌, జేఈఈ పరీక్షలకు సీయూఈటీ వర్తించదు.