కన్నుల పండువగా పద్మ అవార్డుల బహూకరణ

తెలుగు రాష్ట్రాల నుంచి గరికపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణరావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్‌ హసన్‌ సాహెబ్‌ (మరణానంతరం) వారసులు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 
 
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022కు గాను మొదటి విడతలో భాగంగా మొత్తం 64 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ అవార్డులను సోమవారం అందజేశారు. ఇందులో రెండు పద్మ విభూషణ్‌, 8 పద్మభూషణ్‌, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
 
 కీర్తిశేషులు సిడిఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తరపున ఆయన కుమార్తెలు కృతిక రావత్‌, తరిణి రావత్‌, గీతాప్రెస్‌ అధినేత కీర్తిశేషులు రాధేశ్యామ్‌ ఖేమ్కా తరపున ఆయన కుమారుడు కృష్ణ కుమార్‌ ఖేమ్కా పద్మ విభూషణ్‌ పురస్కారాలు తీసుకున్నారు. 
 
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఎమ్‌డి సైరస్‌ పూనావాలా, గుర్మీత్‌ భవా (మరణానంతరం), ఎన్‌ చంద్రశేఖరన్‌, దేవేంద్ర ఝఝరియా, రషీద్‌ ఖాన్‌, రాజీవ్‌ మెహర్షి, సచ్చిదానంద స్వామి పద్మభూషణ్‌ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
 
 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం ఈ నెల 28న జరగనుంది. ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు అందిస్తున్నారు. అవార్డు గ్రహీతల జాబితాలో నాలుగు పద్మ విభూషణ్‌, 17 పద్మ భూషణ్‌, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. 
ఈ రెండు విడతల్లో కలిపి అవార్డు గ్రహీతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ ఎన్‌ఆర్‌ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు అందిస్తున్నారు.