ఇకపై 8- 16 వారాలకే కొవిషీల్డ్

దేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని 8-16 వారాలకు తగ్గించారు. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) కీలక నిర్ణయం వెలువరించింది. సీరం ఇనిస్టూట్ ఈ టీకాను రూపొందించింది. 
 
డోసుల విరామ తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బృందం తెలిపింది. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ రెండు విడతల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలు అంటే 84 రోజులుగా ఉంది. దేశంలో వైరస్ తీవ్రత ఇతరత్రా అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఇమ్యూనైజేషన్ బృందం అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తుంది. 
 
ఇప్పుడు ఈ టీకా డోసుల వ్యవధి మార్పు నిర్ణయం తీసుకుంది.జాతీయ కరోనా టీకా కార్యక్రమం పరిధిలోనే ఎప్పటికప్పుడు టీకాలపై నిర్ణయాలు తీసుకుంటారు. యాంటీబాడీల ఉత్పత్తి స్థాయిని బట్టి వ్యవధి మార్పులో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవధి తగ్గింపు వల్ల దేశంలో అత్యధిక సంఖ్యలో రెండు డోస్‌ల కార్యక్రమం పూర్తవుతుంది. 
 
ఇతర దేశాలలో ఇటీవలి కాలంలో కరోనా వైరస్ సరికొత్త రూపాలలో విస్తరిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి దక్కింది. అయితే ఇప్పటికీ దేశంలో ఆరు నుంచి ఏడు కోట్ల మంది వరకూ కొవిషీల్డ్‌ను ఇప్పుడు ఉన్న గడువు కారణంగా పొందలేదు. రెండు డోస్‌ల మధ్య వ్యవధి ఇంతకు ముందు ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంది. దీనిని ఈ సలహా బృందం సిఫార్సుల మేరకు ప్రభుత్వం గత ఏడాది మే నెలలో 12 నుంచి 16 వారాలకు పొడిగించింది.

 నాలుగో వేవ్ వచ్చినా ఆందోళన అవసరం లేదు  

కాగా, భారత్‌లో కరోనా నాలుగో వేవ్‌ వచ్చినా ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్‌ వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇకపై ఎన్ని వేవ్‌లు వచ్చినా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేశారు. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో పెరిగిన నిరోధక శక్తి వల్ల ఇకపై వచ్చే వేవ్‌లు ప్రభావం చూపలేవని ఎయిమ్స్‌ ఎపిడిమాలజిస్ట్‌ డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ తెలిపారు. 

‘‘కరోనాలో ఇప్పటికే వెయ్యికి పైగా మ్యుటేషన్లు జరిగాయి. వాటిలో ఐదు వేరియెంట్లే ఎక్కువ ప్రభావం చూపాయి. కరోనా రెండో వేవ్‌ భారత్‌లో తీవ్ర ప్రభావం చూపినా డెల్టా వేరియెంట్‌ వల్ల అత్యధికుల్లో ఏర్పడ్డ రోగనిరోధక శక్తి ఇకపై వచ్చే వేవ్‌ల నుంచి కాపాడుతుంది’’ అని పేర్కొన్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి చీఫ్‌ డాక్టర్‌ జుగల్‌ కిశోర్‌ చెప్పారు.