కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు … కేంద్రం హెచ్చరిక

కొద్ది రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ, అనేక దేశాల్లో మళ్లీ తీవ్రమవుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం లేఖ రాశారు. కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. 

అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు. ఇజ్రాయిల్‌లో కొత్త వేరియంట్‌ను గుర్తించడం, అమెరికా, దక్షిణ కొరియా, హాంకాంగ్‌లో కేసులు విపరీతంగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా నాలుగోదశ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొంటుడటం, బారత్‌లోనూ ఆ ప్రమాదం ఉందన్న హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో రాసిన తాజా లేఖలో కరోనా తగ్గిందంటూ ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, గుర్తించడం, చికిత్స, జాగ్రత్త చర్యలు, వ్యాక్సినేషన్‌ వంటి చర్యలను వేగవంత చేయాలని లేఖలో సూచించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తగ్గిందని, భౌతిక దూరం పాటించడం, శుభ్రతా చర్యలు అమలు చేయడం వంటి వాటిలో నిర్లక్ష్యం చేయొద్దనీ హెచ్చరించారు. 

దీనిపై గతంలోనే (ఫిబ్రవరి 25)నే తగు సూచనలు చేశామని, దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు జీనోమ్‌ స్వీకెన్సింగ్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ . కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లో ఉధృతి ఎక్కువగా ఉంటోందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఐరోపా, చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లోనూ కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఆ సంస్థ తెలిపింది. గత మూడు దశల్లోనూ ఈ దేశాల్లో గుర్తించిన మూడు నెలల తరువాత దేశంలో వ్యాప్తి జరిగింది.

ఈసారి కూడా అదే మాదిరి జరిగితే జూన్‌, జులై నెలల్లో పెరుగుదల ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే మాస్కులు పెట్టుకోని వారికి రూ.100 జరిమానా విధిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో అది అమలు జరగడం లేదు.