కొందరు దేవ‌త‌ల‌ను చిన్న‌చూపు చూశామ‌న‌డం నిజం కాదు

తాను సమ్మక్క, సారక్క – వనదేవతల పట్ల చులకనగా మాట్లాడానంటూ చెలరేగిన వివాదంపై చిన్న జీయ‌ర్ స్వామి తొలిసారి స్పందిస్తూ తాము కొంత‌మంది దేవ‌త‌ల‌ను చిన్న‌చూపు చూశామ‌న‌డం నిజం కాదని స్పష్టం చేశారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈమ‌ధ్య కొన్ని వివాదాలు త‌లెత్తాయ‌ని పేర్కొంటూ  అది స‌బ‌బా కాదా అనేది వినే వాళ్ల‌కే వ‌దిలేస్తున్నామని తెలిపాపారు. కాగా,  రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని కోరారు.  మోకాలికి బోడుగుండుకు ముడిపెట్టవద్దని చెబుతూ  తనపేరుపై బ్యాంక్ అకౌంట్ కూడా లేదని వెల్లడించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు దూరం పెరిగినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ తనకు ఎవ్వరితో దూరం పెరగలేదని స్పష్టం చేశారు. అయితే  అవతలివాళ్లు దూరం  పెంచుకుంటే తామేమీ చేయలేమని తేల్చి చెప్పారు. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామని తెలిపారు.  

ఆదివాసీ జ‌నాల‌ గురించి తాము ఎప్పుడూ వాఖ్యలు చేయ‌లేద‌ని స్వామిజి తేల్చి చెప్పారు. పనిగట్టుకుని వివాదం చేసి టీవీల్లో వాళ్ల వాళ్ల ముఖాలను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్ హడావుడి తగ్గడంతో ఈ ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. 

20 ఏళ్ల కింద అన్నమాట గురించి వివాదం జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని, గ్రామదేవతల్ని కించపరిచినట్టుగా ఆరోపణలు వచ్చాయని తెలిపారు. తాము ఎప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. 

తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని తప్పుబట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లిం, క్రిస్టియన్స్‌ కూడా వస్తుంటారని తెలిపారు. తమకు కులం, మతం అనే తేడా లేదని చెప్పారు. అందరిని గౌరవించాలనేది తమ విధానమని ప్రకటించారు. 

మహిళలను చిన్నచూపు చూసేవారిని ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని సమస్యగా మారుస్తున్నారని, సమాజ హితం లేనివారే ఇలాంటి అల్పప్రచారం చేస్తున్నారని జీయర్‌స్వామి ఆక్షేపించారు.

 కొందరు దేవతలను చిన్నచూపు చూసేటట్టు మాట్లాడానని అనడం పొరపాటని చెప్పారు. పూర్వాపరాలు తెలియకుండా ఒక ముక్క విని నిర్ణయానికి రావడం హాస్యాస్పదమని తెలిపారు. కులాలను పక్కనపెట్టి.. జ్ఞానసంపన్నులను ఆరాధించాలని పేర్కొంటూ గిరిజనులు మంత్రాలను అద్భుతంగా చదువుతారని స్వామిజి కొనియాడారు. 

‘‘ఈ మధ్య వచ్చిన ఆరోపణలు.. ఎలా వచ్చాయో వారి వివేకానికే వదిలేస్తున్నా. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు. అది సబబా కాదా అనేది వినేవాళ్లకే వదిలేస్తున్నా. ఎవరి పద్ధతిలో వాళ్లు ఉండాలి. మన పద్థతిని మనం ఆరాధించుకోవాలి. కొందరిని చిన్నచూపు చూసే అలవాటు లేదు. పూర్వాపరాలు చూడకుండా మధ్యలో కొన్ని అంశాలపైనే మాట్లాడం సరికాదు. కొంతమంది దేవతలను చిన్నచూపు చూశామనడం నిజంకాదు’’ అని చినజీయర్‌ వివరణ ఇచ్చారు.

ఆదివాసీలు, హరిజనులు అనే తేడాలేకుండా  ప్రగతిపథంలో నడిపించాలని తమ గురువులు చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో తాము అనేక పాఠశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. 

మ‌హిళ‌ల‌ని కించ‌ప‌రిచేలా తాము ఎప్పుడూ మాట్లాడ‌లేద‌ని స్వామిజి స్పష్టం చేశారు.  మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉంటేనే స‌మాజం అని ఆయన  తెలిపారు. ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం అని చెప్పాలని అంటూ  మ‌హిళ శ‌క్తికి కేంద్రం అని పేర్కొన్నారు. ఇవాళ ల‌క్ష్మీ అమ్మ‌వారి పుట్టిన‌రోజు అని తెలిపారు.

ఏప్రిల్ 16నుంచి 21వ‌ర‌కు శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ స‌హిత అష్ట‌లక్ష్మీ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం అని, తిరు న‌క్ష‌త్రం సంద‌ర్భంగా వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయని గుర్తు చేసారు. తిరుప్పాన్ జ‌న్మ‌కు హ‌రిజ‌నుడు..తిరుమ‌ళ‌సై కూడా జ‌న్మ దృష్ట్యా ఒక ద‌ళితుడు అని తెలిపారు. మ‌నిషి బ్రాహ్మ‌నుడా ..గిరిజ‌నుడా..అని కాకుండా జ్ఞానం మంచిదైతే ఆరాధ‌న‌కు త‌గిన మ‌హానీయులే అవుతారని స్వామిజి తేల్చి చెప్పారు.  జ్ఞానం చూసి ద‌ళితుల‌కు ఆరాధ్య స్థానం క‌ల్పించారని పేర్కొన్నారు.