గుజరాత్ పాఠశాలల్లో ఇకపై భగవద్గీత శ్లోకాలు

గుజరాత్ పాఠశాలల్లో ఇకపై భగవద్గీత శ్లోకాలు వినిపించనున్నాయి. ఆరు నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను బోధనాంశంగా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇది వర్తిస్తుందని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని తెలిపారు. భగవద్గీతలోని విలువలను విద్యార్థులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ అదేశాలు జారీ చేసింది. బడుల్లో ‘గీత’ను బోధించడంతోపాటు గీత పద్యాలు, దానిపై చర్చ వంటి కార్యక్రమాలు కూడా చేపడతారు. 
6 నుంచి 8వ తరగతి వరకు కథలు, శ్లోకాల రూపంలో శ్రీమద్ భగవత్ గీత పాఠాలు ఉంటాయని, 9-12వ తరగతి విద్యార్థులకు కథ, శ్లోకాలు ఫస్ట్ లాంగ్వేజ్ పాఠ్యపుస్తకంలో ఉంటాయని మంత్రి  జీతు వాఘాని తెలిపారు.
2022-23 విద్యా సంవత్సరంలో దేశ సంస్కృతి, జ్ఞాన వ్యవస్థను పరిచయం చేసేందుకు మొదటి దశలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు భగవద్గీత విలువలు, సూత్రాలు బోధిస్తారని పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే, పిల్లలకు ఆడియో, వీడియో రూపాలతో పాటు ప్రింటెడ్ రూపంలో గీతా శ్లోకాలు ఇస్తామని చెప్పారు.